Agriculture

పెసరలో తెగుళ్ల నివారణ

2020 Telugu Agricultural News - Pesara Pest Control

నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేసవిలో మెట్ట పైర్లుగానే కాకుండా రబీ వరి తర్వాత మాగాణుల్లో మినుము, పెసర సాగు చేసే అవకాశాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అయితే పైరు పూత సమయంలో అధిక ఉష్ణోగ్రతకు గురికాకుండా చూసుకోవాలి. దీనికి నీటి వనరులు సహాయపడతాయి. అలాగే వేసవిలో సాగు చేసే మినుము, పెసర రకాలు తక్కువ కాలంలో కాపుకు వచ్చి బెట్టను, వేడిని తట్టుకునేవిగా ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు. దానితో పాటు వేసవిలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్‌ తెగుళ్లను తట్టుకొని, అధిక దిగుబడులు ఇచ్చే విత్తన రకాలను ఎంచుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో ముఖ్యంగా వైరస్‌ తెగుళ్ల యాజమాన్యం గురించిన అవగాహన రైతులకు ఎంతో అవసరం. ఈ విశేషాలతో వేసవిలో వేసుకోదగిన మినుము, పెసర పంటల సాగు, తెగుళ్ల యాజమాన్యం గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు తెలుసుకుందాం.
**వేసవిలో మినుము, పెసర్లను విత్తుకోవడానికి అనువైన రకాలను ఎంచుకోవడం చాలా అవసరం. ఇందు కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్న రకాలను ఎంపిక చేసుకోవచ్చు. మినుము కోసం అయితే జి.బి.జి. 1, టి.బి.జి. 104, ఎల్‌.బి.జి. 752, పి.యు. 31 రకాలు, అలాగే పెసర విత్తుకోవడానికి ఎల్‌.జి.జి. 460, డబ్లూ.జి.జి. 42, ఐ.పి.యం. 2-14, ఎల్‌.జి.జి. 407 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఈ విత్తన రకాలను వరి మాగాణుల్లో మార్చి 15 నుంచి చివరి వరకూ విత్తుకోవచ్చు.
*విత్తనశుద్ది :
ఒక కిలో విత్తనానికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. లేదా 5 గ్రా. థయోమిథాక్సామ్‌ 70 డబ్లూ.ఎస్‌., అలాగే 2.5 గ్రా. కార్బండెజిమ్‌ లేక మాంకోజెబ్‌ మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు, రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే, అధిక దిగుబడి పొందవచ్చు.
*ఎరువులు :
ఎకరానికి 8 కిలోల నత్రజని + 20 కి. భాస్వరాన్ని ఆఖరు దుక్కిలో వేయాలి. వరి మాగాణుల్లో అయితే ఎరువులు వేయనవసరం లేదు.
*విత్తన మోతాదు :
మెట్టలో అయితే ఎకరానికి పెసర 6-7 కిలోలు, మినుము 8-10 కిలోలు విత్తనంగా సరిపోతుంది. ఇక వరి మాగాణుల్లో అయితే పెసర 12 కిలోలు / ఎకరాకు, మినుము 16-18 కిలోలు / ఎకరాకు వేసుకోవాలి.
*కలుపు నివారణ :
మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్‌ 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఊద, గడ్డిజాతి కలుపు నివారణ కోసం వరి మాగాణుల్లో విత్తిన 20-25 రోజుల మధ్య ఎకరాకు విప్‌ సూపర్‌ 250 మి.లీ./ టర్గాసూపర్‌ 400 మి.లీ./ క్లించర్‌ 400 మి.లీ./ 200 లీటర్ల నీటికి కలిపి, పొలమంతా సమానంగా పిచికారీ చేసి, కలుపును నివారించుకోవచ్చు.
వైరస్‌ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం
వేసవిలో వైరస్‌ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ తెగుళ్ళు తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగుల ద్వారానే కాకుండా, కలుపు మొక్కల నుంచి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ వైరస్‌ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహారక మందులు లేవు. కాబట్టి తెగులు వ్యాప్తికి కారకాలైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్ళను నివారించగలమని రైతులు గమనించాలి. వీటిని నిర్మూలించడానికి తగిన చర్యలు చేపట్టాలి.
*వైరస్‌ తెగుళ్ల నిర్మూలనలో భాగంగా పల్లాకు తెగులును తట్టుకొనే రకాలను సాగు చేసుకోవాలి.
*విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. లేక 5 గ్రా. థయోమిథాక్సామ్‌ 70 డబ్లూ.ఎస్‌. మందుతో విత్తనశుద్ధి చేయాలి.
*పంట విత్తుకొనే సమయంలో పొలం చుట్టూ నాలుగు వరుసల్లో మొక్కజొన్న/ జొన్న/ సజ్జ పంటను విత్తుకుంటే పక్క పొలాల నుంచి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులను రాకుండా నివారించవచ్చు.
*పొలంలో, గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి.
*పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి.
* ఎకరాలో అక్కడక్కడా తెల్లదోమ కోసం 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు/ రేకులు/ పళ్లాలను, తామర పురుగుల కోసం 20 నీలిరంగు జిగురు అట్టలను ఉంచటం ద్వారా ఆయా పురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకోవచ్చు.
*విత్తిన 15 లేక 20 రోజులకు ఒకసారి వేపనూనె 5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి, లేదంటే 5% వేప గింజల కషాయం కానీ పిచికారీ చేస్తే పంటను రసంపీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు.
**తెల్లదోమ నివారణ : అంతర్వాహిక కీటక నాశినులైన ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ./ ఎసిఫేట్‌ 1.0 గ్రా./ ప్రొఫెనోఫాస్‌ 1.5 మి.లీ./ ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా./ థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా./ మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ./ డైమిథోయేట్‌ 2.0 మి.లీ./ మిథైల్‌ ఓ డెమటాన్‌ 2.0 మి.లీ.లల్లో ఏదేని ఒకదానిని ఒక లీటరు నీటికి కలిపి, తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
**తామర పురుగుల నివారణ :
ఎసిఫేట్‌ 1 గ్రా./ ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ./ డైమిథోయేట్‌ 2.0 మి.లీ./ థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా./ మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ.లల్లో ఏదో ఒక మందును ఒక లీటరు నీటికి కలిపి, తామర పురుగుల ఉధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. పైరు పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి, పిచికారీ చేయాలి. దీనివల్ల తామర పురుగులతో పాటు మారుక మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు.
**పేనుబంక పురుగు నివారణ :
ఎసిఫేట్‌ 1.0 గ్రా./ ఇమిడాక్లోప్రిడ్‌ 0.4 మి.లీ./ ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా./ థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా./ మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ./ డైమిథోయేట్‌ 2.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
* చివరిగా పైరు బెట్టకు వచ్చి ఎదుగుదల తక్కువగా ఉన్నపుడు ఎకరాకు కేజి పొటాషియం సైట్రేట్‌ను పైపాటుగా పిచికారీ చేసుకోవాలి.