Business

RBI వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయి-వాణిజ్యం

Business News Roundup Today - RBI To Reduce Interest Rates

* ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని, గిరాకీని మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీరేట్లు మరింత తగ్గించవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. ‘ఇప్పటికే ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాలను ప్రకటించింది. ఇవన్నీ గిరాకీని పెంచేందుకు ఉద్దేశించినవే. భవిష్యత్తులో కూడా వడ్డీరేట్లతో పాటు ఆర్థిక సాయం రూపేణ కూడా మరిన్ని చర్యలుంటాయి’ అని వివరించారు. ‘వడ్డీరేట్లు తగ్గించేందుకు ఇంకా అవకాశాలున్నాయి. పశ్చిమ ఐరోపా వంటి దేశాల్లో చూస్తే 0 శాతం లేక ప్రతికూల వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయి’ అని ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020 సమావేశాల్లో సన్యాల్‌ చెప్పారు. ‘వడ్డీరేట్లు గణనీయంగా తగ్గించేందుకు మార్గాలున్నాయి, ఆర్‌బీఐ క్రమానుగతంగా ఈ చర్య తీసుకుంటోంది. ఇక జీడీపీతో పోలిస్తే, రుణాల శాతం కూడా అమెరికా, బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువగానే ఉంది. అందువల్ల ఆర్థిక సాయం కూడా చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో గిరాకీ పెంచేందుకు చర్యలు తీసుకున్నా, ప్రయోజనం ఉండదు. అందుకే దశలవారీగా లాక్‌డౌన్‌ ఉపసంహరణకు అనుగుణంగా ఈ చర్యలూ ఉంటాయి. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి, సరఫరా వ్యవస్థల్లో పలు సంస్కరణలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొవిడ్‌-19 సంక్షోభం కొనసాగుతుండగానే భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తాయి. వినియోగదారుల వ్యవహారశైలి బాగా మారింది. అందువల్ల అన్ని అంశాలను గమనించకుంటూ, గిరాకీ పెంచేలా విధానాలు రూపొందిస్తారు’ అని వెల్లడించారు.

* వినియోగదారులకు భద్రతాపరంగా మరింత మెరుగైన సేవలు అందిచడంలో భాగంగా గూగుల్‌ సంస్థ ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్‌లన్నింటిలో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది. వినియోగ దారులు వెంటనే ఈ యాప్‌లను తమ మొబైల్ ఫోన్‌ల నుంచి తొలగించాలని సూచించినట్లు సమాచారం.

* హోండా కార్స్‌ ఇండియా ప్రీమియం సెడాన్‌ మోడల్‌ సివిక్‌లో బీఎస్‌-6 నిబంధనలకు లోబడిన డీజిల్‌ వెర్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. డీజిల్‌ సివిక్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ.20.75 లక్షలు, రూ.22.35 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. 2019 మార్చి నుంచి కంపెనీ సివిక్‌ మోడల్‌లో బీఎస్‌-6 పెట్రోల్‌ వెర్షన్‌ను విక్రయిస్తోంది. కొత్త డీజిల్‌ సివిక్‌ వెర్షన్‌తో వినియోగదారులు తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే సౌలభ్యం కలిగిందని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) రాజేశ్‌ గోయల్‌ అన్నారు. డీజిల్‌ సివిక్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లో కూడా లభించనుంది. 1.6 లీటర్‌ టర్బో ఇంజిన్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లు 120 పీఎస్‌ శక్తిని అందిస్తాయి. లీటర్‌కు 23.9 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కలిగిన 17.7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 8 వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

* ఇకపై ఏ వస్తువైనా ఎక్కడ తయారైందో (కంట్రీ ఆఫ్‌ ఆరిజిన్‌), ఆ ఉత్పత్తిపై తప్పక ప్రదర్శించాల్సిందే. ఆన్‌లైన్‌లో లేక దుకాణాల్లో.. ఎక్కడ విక్రయించినా కూడా, ఇది తప్పనిసరి. గరిష్ఠ విక్రయధర, ఎప్పటివరకు వినియోగించవచ్చు, నికర పరిమాణం, ఎలా వినియోగించాలి వంటి సూచనలతో పాటు ‘తయారీ దేశం’ వివరాలు ముద్రిస్తేనే విక్రయించాల్సి ఉంటుంది.

* గురువారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు నేలచూపులు చూస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 51 పాయింట్లు దిగజారి 36,686 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 10,800వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.76 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాల నేపథ్యంలో కంపెనీల షేర్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

* కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఈ) సంస్థలకు సాయం చేసేందుకు మరో రూ.250 కోట్లు కేటాయించినట్లు అంతర్జాతీయంగా చెల్లింపుల సేవలు అందించే సాంకేతిక దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ ప్రకటించింది. 2025 వరకు భారత్‌లో 100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెడతామన్న సంస్థ గత నిర్ణయానికి అదనంగా ఈ సాయం ప్రకటించింది. చిన్న వాణిజ్య సంస్థల డిజిటలీకరణకు, ఆయా సంస్థలు రుణాలు సులభతరంగా పొందేలా సాయం చేసేందుకు, మహిళా ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు వినియోగిస్తామని మాస్టర్‌కార్డ్‌ దక్షిణాసియా అధిపతి పోరష్‌ సింగ్‌ తెలిపారు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతంగా సంస్థ వెచ్చించనున్న 250 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1875 కోట్ల) సాయంలో భాగంగా ఈ నిధులు భారత్‌కు కేటాయించామన్నారు. కోటి మంది వ్యాపారులు డిజిటల్‌ పద్ధతిలో నగదు స్వీకరించేలా చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. దుకాణదారులు, బ్రాండ్లతో ఒప్పందం చేసుకునేలా చేస్తామని, ఇందువల్ల పారదర్శక అమ్మకాలు పెరిగి, ఆర్థిక సంస్థలకు సదరు వ్యాపారాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇందువల్ల రుణాల మంజూరు సులభమవుతుందని పేర్కొన్నారు.

* మార్చితో ముగిసిన త్రైమాసికంలో అరవింద్‌ ఫ్యాషన్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.208.12 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.21.30 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రతికూల మార్కెట్‌ పరిస్థితులు ప్రభావం చూపాయని కంపెనీ తెలిపింది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1168.96 కోట్ల నుంచి 39.22 శాతం తగ్గి రూ.710.46 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు కూడా రూ.1162.89 కోట్ల నుంచి 22.98 శాతం తగ్గి రూ.895.58 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2019-20)లో కంపెనీ రూ.399.36 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2018-19లో కంపెనీ లాభం రూ.21.48 కోట్లుగా ఉంది. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.4,643.86 కోట్ల నుంచి 16.74 శాతం తగ్గి రూ.3,866.30 కోట్లకు చేరింది.