DailyDose

ట్రంప్ పొరపాటున కూడా భారత్‌కు సహకరించరు-తాజావార్తలు

ట్రంప్ పొరపాటున కూడా భారత్‌కు సహకరించరు-తాజావార్తలు

* ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయ రంగం, రైతుబంధుపై సమీక్ష సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. 100 శాతం నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం శుభసూచకమన్నారు. భవిష్యత్తులో సాధించే విజయానికి ఇది నాంది అని చెప్పారు. విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసే విత్తనాల నిల్వకు శీతల గిడ్డంగి నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ. 25 కోట్లతో అతిపెద్ద అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. దసరా నాటికి రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

* తెలంగాణలో కరోనా బాధితులకు సరైన వైద్యం అందడం లేదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు ఆస్పత్రి నుంచి 50 పడకలు తీసుకుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. పేద మధ్య తరగతి ప్రజల కోసం కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చాలని, ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యం నింపాలని కోరారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని చెప్పారు. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ చేస్తున్నాయని భట్టి విమర్శించారు.

* భారత్‌-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే.. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై ఇటీవల పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరింత ముదిరితే.. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు అండగా ఉంటారన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. జపాన్‌, భారత్‌ వంటి పొరుగు దేశాలతో చైనా గిల్లీకజ్జాలు పెట్టుకుంటోదని డ్రాగన్‌ దుశ్చర్యలను ఎండగట్టారు. తాజాగా వియాన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* కొవిడ్‌-19 కట్టడి, సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సమీక్షించారు. కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులను ప్రశంసించారు. అహ్మదాబాద్‌లో విజయవంతమైన ‘ధన్వంతరి రథ్‌’ కార్యక్రమాన్ని అంతటా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.

* గత ప్రభుత్వాల వలస విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాటిని సమూలంగా మార్చే దిశగా సాగుతున్నారు. ఇప్పటికే కరోనా సంక్షోభం సాకుతో పలు వలసేతర వీసాలపై నిషేధం విధించిన ఆయన తాజాగా ఒబామా సర్కార్‌ మానవతా థృక్పథంతో తెచ్చిన ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ ప్రోగ్రాం’(డీసీసీఏ)కు స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు త్వరలో ఓ సమగ్ర వలస విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

* మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి రైల్వేస్టేషన్‌ వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా ఈయన పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన‌ కుమార్తెను కరుణాకరణ్‌ అనే వ్యక్తి గొంతుకోసి చంపాడు. కుమార్తె మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

* కరోనా ఆస్పత్రుల్లో తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఏలూరు కలెక్టర్‌ ఆఫీసు నుంచి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో మాధ్యమం ద్వారానే కొవిడ్‌ ఆస్ప్రతుల్లోని రోగులతో మాట్లాడారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో భోజనం నాణ్యత సరిగా లేదని, దుప్పట్లు ఇవ్వట్లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని మంత్రికి రోగులు ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా 1800 233 1077 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అతడి కుటుంబసభ్యులు స్పందించారు. తగిన శిక్ష పడిందని పోలీసు చర్యను వారు సమర్థించారు. వికాస్‌ దుబే అంత్యక్రియల్లో పాల్గొన అతడి భార్య రిచా దుబే మాట్లాడుతూ.. ‘నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

* పాకిస్థాన్‌ నుంచి 250-300 మంది ముష్కరులు నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ వీరేంద్ర వత్స్‌ తెలిపారు. సరిహద్దు వద్ద పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. భారత భూభాగంలో చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు శనివారం మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.

* మంత్రి గంగుల కమలాకర్‌ ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొత్తపల్లి ఎస్సైకి గాయాలయ్యాయి. కరీంనగర్‌లోని ఆర్టీసీ వర్క్‌షాప్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంలో ఆ వాహనంలో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్‌ చేతి బొటనవేలు తెగిపోయింది. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్ననపేటలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రైతుభరోసా కేంద్రం నిర్మాణానికి శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేసి వెళ్లిపోయిన అనంతరం పార్టీలోని ఇరువర్గాల నాయకులూ దుస్తులు చిరిగేలా కొట్టుకున్నారు. పలువురు నాయకులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

* రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ ‘‘రాజస్థాన్‌లో ప్రభుత్వం స్థిరంగా ఉంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న నాయకులే ఇప్పుడు కాంగ్రెస్‌ను చూసి భయపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దృష్టి పెట్టాం’’అని అశోక్‌ గహ్లోత్‌ తెలిపారు.