ఏకంగా ఎస్ బీఐ పేరిట నకిలీ బ్రాంచ్ నే సృష్టించిన ఘనులు! తమిళనాడులో ఘటన!! బ్యాంకు లావాదేవీల పేరిట ఆర్థిక మోసాలు అందరికీ తెలిసిందే. అయితే మోసాలు చేయడం కోసం కొందరు దేశముదుర్లు ఏకంగా ఓ నకిలీ బ్యాంకు శాఖనే సృష్టించారు! ఈ ఘటన తమిళనాడులో జరిగింది. బ్యాంకు పూర్వ ఉద్యోగి కుమారుడు, అతని స్నేహితులు ఇద్దరు ఈ ఘరానా మోసంలో భాగస్వాములు. కడలూరు జిల్లా పన్రూటి ప్రాంతంలో నివసించే కమల్ బాబు ఈ నకిలీ బ్యాంకు ప్రధాన సృష్టికర్త. కమల్ బాబు తల్లి ఓ బ్యాంకులో పనిచేసి రెండేళ్ల కిందట రిటైరైంది. కమల్ బాబు స్నేహితుల్లో ఒకరు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తుండగా, మరో స్నేహితుడు రబ్బర్ స్టాంపులను తయారుచేస్తుంటాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో భారతీయ స్టేట్ బ్యాంకు-నార్త్ బజార్ పేరుతో ఓ బ్రాంచ్ ను తెరిచారు. 3 నెలల పాటు ఎవరికీ అనుమానం రాకుండా కార్యకలాపాలు సాగించినా, చివరికి ఓ ఖాతాదారుడికి అనుమానం రావడంతో వీళ్ల గుట్టు రట్టయింది. ఆ ఎస్ బీఐ ఖాతాదారుడి ఫిర్యాదుతో అధికారులు విచారణ జరపగా, ఓ నకిలీ బ్రాంచ్ దర్శనమివ్వడంతో దిగ్భ్రాంతి చెందారు. పన్రూటిలో ఉన్నది రెండే బ్రాంచ్ లు అయితే, ఈ మూడో ఎస్ బీఐ బ్రాంచ్ ఎక్కడ్నించి వచ్చిందని విస్తుపోయారు. ఆ బ్రాంచ్ లోకి వెళ్లిన అధికారులకు అందులోని ఏర్పాట్లు ఆశ్చర్యం కలిగించాయి. ఒరిజనల్ బ్రాంచ్ కు తీసిపోని రీతిలో అన్ని వ్యవస్థలు అందులో ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్రాంచ్ నుంచి పెద్దగా లావాదేవీలు జరగకపోవడంతో కస్టమర్లెవరికీ నష్టం జరగలేదు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమల్ బాబును, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.
అరవ సోదరులు ఏకంగా SBI నకిలీ శాఖనే ప్రారంభించారు
Related tags :