హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు నేపాల్ దేశస్థుడంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన సంచలన వ్యాఖ్యలపై భారతీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ‘అయ్యో.. రాముడేం ఖర్మ, విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలు మీవే’నంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా సోమవారం నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి “సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. రాముని జన్మస్థానంగా చెప్పుకుంటున్న అయోధ్య ఉత్తరప్రదేశ్‌లో లేదు, అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. ఇప్పుడు భారత్‌లో ఉన్న అయోధ్య కల్పితం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారతీయ ప్రజలు ట్విటర్‌లో ఓలిని విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. “ప్రస్తుతమున్న నేపాల్ 2025కల్లా ప్రపంచ దేశాలను ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత 2030 కల్లా అంతరిక్షంలోని గ్రహాలను, అనంతరం అంతరిక్షాన్ని, మొత్తం అనంత విశ్వాన్నే ఆక్రమించుకుంటుంద”ని ఓ నెటిజన్ పేర్కొన్నారు
“రానున్న రోజుల్లో నేపాల్ ప్రధాని ఇలా అంటారు.. న్యూయార్క్ అమెరికాలో లేదు, నేపాల్‌లో ఉంది. అంతెందుకు ఆస్ట్రేలియా కూడా నేపాల్‌దే. టోక్యో, పారిస్ లండన్, బెర్లిన్, సూడాన్, బ్యాంకాక్, లాస్ వెగాస్, ఇస్లామాబాద్ అన్నీ నేపాల్‌వే. నేపాల్‌వాసినైనందుకు నాకు గర్వంగా ఉంది”, “ఆయన్ను అలాగే వదిలేస్తే రావణుడు చైనా, గౌతమ్ బుద్ధుడు రష్యా, మహవీర్ నార్త్ పోల్ నుంచి వచ్చాడంటారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “రాముడు నేపాల్ వాస్తవ్యులా.. ఇదెప్పుడు జరిగింది?” అంటూ మీమ్స్‌రాయుళ్లు ఫన్నీ క్యాప్షన్‌లతో చెలరేగిపోతున్నారు. కాగా ఓలి.. వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్‌లోనే ఉందని, దశరథుడు తమ దేశాన్ని పాలించేవాడని, అతని కొడుకు రాముడు కూడా ఇక్కడే పుట్టాడని వాదించగా వాటిని భారతీయులు కొట్టిపారేశారు