* రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానానికి ఎగబాకారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఆయన వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కినెట్టారు. ఇటీవల బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన ర్యాంకుల్లో 8వ స్థానంలో నిలిచిన ముఖేశ్ కొన్ని రోజుల వ్యవధిలోనే 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన నికర సంపద విలువ 68.3 బిలియన్ల నుంచి 72.4 బిలియన్లకు పెరిగింది.
* దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ తన డీల్స్ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ కూడా రిలయన్స్ జియో డిజిటల్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ డిల్విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు ఉండవచ్చని ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్ ఒక కథనాన్ని మంగళవారం రిపోర్ట్ చేసింది. దీనిపై గూగుల్, రిలయన్స్ స్పందించలేదు. అన్నీ సాఫీగా జరిగితే ఇది రిలయన్స్ చేసుకొనే 14 డీల్‌గా నిలుస్తుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ 660 పాయింట్లు నష్టపోయి 36,033 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు కుంగి 10,607 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. హాత్వే కేబుల్ అండ్ డేటా, ఎఫ్డీసీ లిమిటెడ్, ర్యాలీస్ ఇండియా షేర్లు భారీగా లాభపడగా.. బీహెచ్ఈఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఒక్క టెలికామ్ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు కుంగాయి. సూచీల్లోని ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌షేర్లు 5శాతానికి పైగా పతనం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2శాతానికి పైగా నష్టపోయాయి. ముఖ్యంగా వాహన రుణాల విషయంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు రావడం, విక్స్ సూచీ కూడా పెరగడం ఇన్వెస్టర్లను భయపెట్టింది.
* కరోనా వైరస్ నుంచి తమ వినియోగదారులు, ఉద్యోగులను కాపాడుకొనేందుకు సంస్థలన్నీ భిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మరో అడుగు ముందుకేసింది. తమ ఉద్యోగులు ఎక్కడి నుంచైనా (వర్క్ ఫ్రం ఎనీ లొకేషన్) పనిచేసే వ్యవస్థను తీసుకురానుంది. వినియోగదారుల కోసం కాంటాక్ట్ లెస్ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించనుంది.
* కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ సంస్థ శివ టెక్స్యార్న్ రూపొందించిన క్లాత్మాస్క్కు ఐఎస్ఓ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ ఎండీ డాక్టర్ కేఎస్ సుందరరామన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో హిఐక్యూ విరోబ్లాక్ సాంకేతికత ఉపయోగించి, ఎలాంటి రసాయనాల వాడకం లేకుండా వస్త్రంతో రూపొందించిన తొలిమాస్కు ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో దాదాపు 99శాతం వీటి ద్వారా ప్రయోజనముంటుందన్న ఆయన ఈ మాస్కుల్ని రూ.49కే అందించనున్నట్లు తెలిపారు. ఒక్క మాస్కును ఎన్నిసార్లు ఉతికినా వైరస్‌ను తట్టుకునే శక్తి పోదన్నారు.
* 2015-16 నుంచి 2019-20 మదింపు సంవత్సరాలకు ఇ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్) వెరిఫికేషన్ చేసుకోని పన్ను చెల్లింపుదార్లకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. 2020 సెప్టెంబరు 30 కల్లా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. డిజిటల్ సంతకం లేకుండా ఆన్లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌లను చేసినప్పుడు.. ఆధార్ ఓటీపీ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడం లేదా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్-వీ పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌లు అప్లోడ్ చేసిన 120 రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ (ఐటీఆర్-వి) పత్రం కోసం వేచి ఉన్న ఇ-ఫైలింగ్ రిటర్న్‌లు చాలానే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. సకాలంలో ఐటీఆర్-వీలను సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోరని పేర్కొంది. అందుకే ఈ విషయంలో పన్ను చెల్లింపుదార్లలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాల ఇ-ఫైలింగ్ రిటర్న్‌ల వెరిఫికేషన్‌కు సెప్టెంబరు 30 వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
* కొవిడ్-19 సంక్షోభం ఆరంభమయ్యాక, 3 నెలల వ్యవధిలో భారత్‌లో తమ శీతల పానీయాల అమ్మకాల్లో రెండంకెల క్షీణత గుర్తించినట్లు పెప్సికో ఇన్క్ ప్రకటించింది. జూన్ 13తో ముగిసిన 12 వారాల వ్యవధిలో చిరుతిళ్ల (స్నాక్స్) అమ్మకాలు కూడా ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో తగ్గాయని పేర్కొంది. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాల్లో శీతల పానీయాల విక్రయాలు 25 శాతం తగ్గాయని వివరించింది. భారత్, పాకిస్థాన్లలో రెండంకెల క్షీణత, నైజీరియా, మధ్యప్రాచ్యం అమ్మకాలలో ఒక అంకె క్షీణత లభించినట్లు తెలిపింది.