కరెంటు తీగలపై కూర్చునే పక్షులకు షాక్ ఎందుకు కొట్టదు ?
కరెంటు తీగలను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇండ్లకు, పరిశ్రమలకు అందే విద్యుత్ రకరకాలుగా ఉంటుంది. చాలా వరకు ఇండ్లకు సింగిల్ ఫేజ్ కరెంటే వస్తుంది. కానీ పరిశ్రమలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తారు. ఇందుకు లైన్లు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఏ లైన్‌కు చెందిన కరెంటు తీగలను ముట్టుకున్నా సరే.. షాక్ కొడుతుంది. కానీ పక్షులు మాత్రం కరెంటు తీగలపై వాలితే వాటికి షాక్ అస్సలు కొట్టదు. అవును కదా. అయితే అలా ఎందుకు జరుగుతుందంటే…
మొదటి కారణం :
విద్యుత్తు తక్కువ నిరోధం గుండా ప్రవహిస్తుంది. జీవులన్నీ కొద్దో గొప్ప నిరోధం (Resistance) కలిగి ఉంటాయి. పక్షి మనిషి కన్నా ఎక్కువ నిరోధం కలిగి ఉంటుంది కాబట్టి విద్యుత్తు పక్షి గుండా ప్రవహించదు. అది కరెంటు తీగ ద్వారా ప్రవహించడాన్నే ఎంచుకొంటుంది.
2వ కారణం :
విద్యుత్తు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న చోటునుంచి తక్కువ పొటెన్షియల్ ఉన్న చోటికి ప్రవహిస్తుంది. పక్షి ఒకే వైరు మీద కూర్చున్నప్పుడు ఆ రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం దాదాపు శూన్యం. కాబట్టి కరెంటు పక్షి గుండా ప్రవహించదు .
ఒక వేళ పక్షి ఒక వైరు మీద కూర్చొని మరో కరెంట్ వైర్ నో, భూమినో తాకితే ( సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది) అప్పుడు కరెంటు పక్షిగుండా ప్రవహించి భూమిలోకి వెళుతుంది. అప్పుడు దానికి షాక్ కొడుతుంది. అంతెందుకు కరెంటు తీగల్లో ఒకే తీగని గట్టిగా పట్టుకొని భూమి తగలకుండా వేళ్ళాడితే మనకు కూడా కరెంటు షాక్ కొట్టదు ( సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, కరెంట్ పాస్ అవ్వదు ).అలా అని ఆ పనిచేయకండి…. కాస్త పొరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది!