DailyDose

గాంధీ ఉద్యోగులతో కేసీఆర్ డీల్-తాజావార్తలు

గాంధీ ఉద్యోగులతో కేసీఆర్ డీల్-తాజావార్తలు

* కొలిక్కి వచ్చిన గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తో ప్రభుత్వ చర్చలు..నర్సులకు 17 వేల 500 ల నుండి, 25 వేలు… కరోనా డ్యూటీలు చేస్తున్న వాళ్లకు డైలీ ఇంటెన్సివ్ కింద 750 రూపాయలు..అవుట్ సోర్సింగ్ నుంచి, కాంట్రాక్టు లోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ హామీ..నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 ల రూపాయల ఇన్సెఒటివ్, 15 రోజులు మాత్రమే డ్యూటీ..ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన నర్సులు.

* ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నేడు దృశ్యమాధ్యమ విధానంలో ప్రారంభమైంది. తొలుత కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ మాట్లాడుతూ ‘‘మానవ చరిత్రలోనే కరోనా వైరస్‌ అత్యంత ఇబ్బంది కరమైన పరిస్థితి. కొవిడ్‌ తర్వాత భారత్‌, మిగిలిన ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను. భారత్‌లో వేగంగా పెరిగిన డేటా డిమాండ్‌ను తట్టుకొని జియో నిలిచింది. జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు అందిస్తుంది’’ అని అన్నారు.

* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు సాయమందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ చేయూత పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో రూ.65వేలు ఇచ్చే ఈ పథకానికి సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో దీనికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు కానుంది.

* భాగ్యనగరంలో ఐటీ రంగం పురోగతి బాగుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐటీ అభివృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని చెప్పారు. ఉప్పల్‌లో బుధవారం నిర్వహించిన హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ఆయన.. ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో నలువైపులా సమాన అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

* ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో దాదాపు అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో యవత ఉపాధిని మార్గాలను అన్వేషించుకోవడంతోపాటు ఉద్యోగ విపణిలో దీటుగా నిలబడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. ‘స్కిల్‌, రీ-స్కిల్‌, అప్‌స్కిల్’‌ (నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, నైపుణ్యాలను ఇతరులకు నేర్పించడం) ఎంతో కీలకమని, ఇదే యువతకు ఉపాధి మంత్రమని ప్రధానమంత్రి సూచించారు.

* ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక సంఖ్యలో 44 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరగా.. మరణాల సంఖ్య 452కి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారిలో 2,412 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 20 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

* కాంగ్రెస్‌ తిరుబాటు నేత సచిన్‌ పైలట్‌కు ఇంకా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులు అవినాశ్‌ పాండే అన్నారు. తాను భాజపాలో చేరట్లేదని సచిన్‌ పైలట్‌ ప్రకటించిన కాసేపటికే అవినాశ్‌ పాండే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘సచిన్‌ పైలట్‌కు కాంగ్రెస్‌ ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి. తన తప్పును తెలుసునేలా భగవంతుడు అతనికి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. భాజపా వల నుంచి ఆయన బయటపడతారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

* దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడం అనివార్యమయ్యింది. దీనిలోభాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3,20,161 శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఒకేరోజు ఈ స్థాయిలో పరీక్షలు చేపట్టడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు 1,24,12,664 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.‌

* కరోనా వైరస్‌కు కళ్లెం వేసే టీకా కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా ప్రాథమిక క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు మంగళవారం వెల్లడించింది. తొలిదశలో భాగంగా 45 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు తెలిపింది. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి వీరిలో ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది.

* భారత్‌, ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆగస్టులో జరగాల్సిన న్యూజిలాండ్‌-ఏ పర్యటన సైతం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ మాసంలో ఇంగ్లిష్ జట్టు భారత్‌లో పర్యటించాలి. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో ఇంగ్లాండ్‌ జట్టు ప్రయాణించే సూచనలు కనిపించడం లేదు.

* ‘ఆచార్య’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ కోసం రెజీనాను సంప్రదించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయిత ఆ తర్వాత దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి తమన్నా పేరు వచ్చింది. ‘సైరా’ సినిమాలో వీరిద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో తమన్నా చిరుతో ఆడిపాడితే వరుసగా రెండో సినిమా అవుతుంది. మరి ‘ఆచార్య’ బృందం ఎవరికి ఎంపిక చేస్తుందో చూడాలి.