* నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలని రమేశ్‌కుమార్‌కు సూచించింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ను కోరాలని ఆదేశించింది.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు.అంతేకాకుండా న్యాయస్థానం నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలన్నారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేఖను జతచేస్తూ.. నిమ్మగడ్డ రేపు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్న విషయం తెలిసిందే.
* మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సుమిత్రాదేవి కస్డేకర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా తన రాజీనామా లేఖను ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందజేశారు. ఆయన వెంటనే ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపారు. అనంతరం సుమిత్రాదేవి భోపాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
* రాజస్థాన్‌లో పుట్టిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. స్పీకర్ జారీ చేసిన నోటీసులపై పైలట్ వర్గం హైకోర్టుకు వెళ్లగా.. విచారణను రాజస్థాన్ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. సోమవారం తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. అనర్హత వేటుపై సమాధానం ఇవ్వాలంటూ స్పీకర్ ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వరకు రెబల్ అభ్యర్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని స్పీకర్‌కు సూచించింది.
* కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సమయంలో అజాగ్రత్తగా ఉండటం కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కోవిడ్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎంతమందికైనా సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. కరోనా కట్టడిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువ అని అన్నారు.
* ఏపీలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో రోజుకు రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో ఇతర రాష్ట్రాల్లోని వారు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 40,646కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై కొనసాగున్న ఉత్కంఠకు తెరపడింది. కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతను కొనసాగించేందుకు అనుమతించింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
* టీమ్‌ఇండియాలో గంగూలీ, ధోనీ ఎంత గొప్ప సారథులో అందరికీ తెలిసిందే. ఒకరు జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దితే మరొకరు ఆ జట్టును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే, గంభీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగూలీ మ్యాచ్ విన్నర్లను తీసుకొచ్చినంతగా ధోనీ తీసుకురాలేకపోయాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీ, రోహిత్, బుమ్రాలు తప్ప గొప్ప ఆటగాళ్లు రాలేరని గౌతీ అన్నాడు. ఇదే విషయాన్ని ఆకాశ్‌చోప్రా ఖండించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ధోనీ టీమ్‌ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఆ తర్వాత 2017లో కోహ్లీకి అప్పగించాడని చెప్పాడు. అలాగే జట్టులో మార్పులు చోటుచేసుకుంటున్న వేళ మహీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడని వివరించాడు.
* గూఢచర్యం ఆరోపణలపై పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాక్ వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింది. తమ అధికారులు లేకుండా కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత్ దౌత్యాధికారులకు అవకాశం కల్పించింది. కుల్‌భూషణ్‌ను గురువారం అధికారులు కలిసేందుకు వెళ్లగా అక్కడ పాక్ అధికారులు ఉండడం పట్ల భారత్ అభ్యంతరం లేవనెత్తింది. అడ్డంకులు, అవరోధాలు లేని భేటీ విషయంలో అంతర్జాతీయ చట్టాలను పాక్ ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మూడో సారి భేటీకి తమ దేశ అధికారులు లేకుండానే భేటీకి అవకాశం ఇస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి శుక్రవారం వెల్లడించారు.
* భారత్ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘గల్వాన్ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించింది. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. ప్రపంచానికి భారత్ శాంతి సందేశాన్ని ఇచ్చింది. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
* దేశంలో రికార్డు స్థాయిలో పేదరికం తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 2005-06 నుంచి 2015-16 మధ్యన 27.3 కోట్ల మంది అనేకరకాలుగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ విభాగం నుంచి భారీసంఖ్యలో జనభా బయటపడిందని వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పేదరికం, మానవ అభివృద్ధి కార్యక్రమం (ఓపీహెచ్‌ఐ) ఈ నివేదికను విడుదల చేశాయి. 75 దేశాలను అధ్యయనం చేయగా 65 దేశాల్లో 2000-2019 మధ్య పేదరికం తగ్గిందని వెల్లడించాయి. ఆరోగ్యం, విద్య, జీవనం, మెరుగైన ఉపాధి ప్రమాణాలు కొరవడటం, హింస, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం వంటి అంశాలను పేదరికం కొలిచేందుకు ప్రమాణాలుగా తీసుకున్నారు.
* కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తాజాగా భారత్‌లో ఈ కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఆ సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులను చేపడుతూనే తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాల్లో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలను అమలుచేస్తున్నాయి. మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అసోంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లొ వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ సమయంలో దాదాపు అన్నిప్రాంతాల్లో వ్యవసాయ పనులు, అత్యవసర సర్వీసులు, సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నాయి.
* టీమ్‌ఇండియా మాజీ పేసర్, బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్‌తో ‘డీఆర్‌ఎస్ విత్ ఆశ్’ అనే కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్ 1996 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఆమిర్ సోహేల్‌ను ఔట్ చేసిన విధానం నుంచీ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా తాను ఎదిగిన తీరును వివరించాడు. ఆ క్రమంలోనే 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాక్‌తో లీగ్ స్టేజ్‌లో తలపడిన ఓ మ్యాచ్ గురించి స్పందించాడు. అప్పుడు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చాడు. ముందే టీమ్‌ఇండియా ఆ బౌలౌట్ పద్ధతిని ప్రాక్టీస్ చేసేదని వెంకటేశ్ అన్నాడు.
* దేశంలో కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరు తప్పనిసరైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ప్రయాణాల్లో భౌతిక దూరం ఉండదన్న భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు కొత్త సదుపాయం అందిస్తోంది. భౌతిక దూరం పాటించాలనుకునే ప్రయాణికుడు రెండు సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జులై 24 నుంచి దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.