Business

బ్రిటానియా బిస్కెట్లు తెగ తినేశారు

బ్రిటానియా బిస్కెట్లు తెగ తినేశారు

అధికాదాయం లభించడంతో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. జూన్‌ 30, 2020తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలై రూ.542.68 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.248.64 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం సైతం 26.97 శాతం వృద్ధితో రూ.2,767.8 కోట్ల నుంచి రూ.3,514.35 కోట్లకు చేరుకుంది. ‘కరోనా కారణంగా జూన్‌ త్రైమాసికం గడ్డుకాలంగా మారింది. లాక్‌డౌన్‌ వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయి. దేశవ్యాప్తంగా ప్లాంట్లు, డిపోలు, రవాణా, వెండార్లకు సంబంధించిన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఇపుడు తిరిగి కరోనా పూర్వపు స్థాయికి పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నామ’ని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ఎండీ వరుణ్‌ బెర్రీ పేర్కొన్నారు. ‘కీలక ముడి పదార్థాల ధరలు మోస్తరుగా పెరిగాయి. అయితే రుతుపవనాలు, పంట దిగుబడిపై సానుకూలతలున్నందున ధరలు స్థిరంగానే కొనసాగొచ్చ’ని ఆయన అంచనా వేశారు. శుక్రవారం బీఎస్‌ఈలో బ్రిటానియా షేరు ధర 1.81 శాతం నష్టంతో రూ.3784.10 వద్ద ముగిసింది.