DailyDose

HCLకు శివనాడార్ వీడ్కోలు-వాణిజ్యం

Business Roundup - Sivanadar Leaves HCL

* ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి సంస్థ వ్యవస్ధాపకుడు శివ్‌ నాడార్‌(75) వైదొలిగారు. ఆ బాధ్యతల్ని ఇకపై ఆయన కుమార్తె రోషిణీ నాడార్‌ మల్హోత్రా నిర్వహించనున్నారు. శివ్‌ నాడార్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాతో ఎండీగా కొనసాగనున్నారు. రోషిణీ నియామకం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.

* యెస్‌ బ్యాంక్‌ ఎఫ్‌పీవోను ఇప్పటి వరకు 92.55 శాతమే సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. జులై 17 బిడ్డింగ్‌కు చివరి తేదీ. 909.97 కోట్ల షేర్లకు బిడ్డింగ్‌ ఆహ్వానించగా ఇప్పటి వరకు 843.48 కోట్లకు మాత్రమే బిడ్డింగ్‌లు వచ్చినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా తెలిసింది.

* దేశంలో కరోనా విజృంభణతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరు తప్పనిసరైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ప్రయాణాల్లో భౌతిక దూరం ఉండదన్న భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు కొత్త సదుపాయం అందిస్తోంది. భౌతిక దూరం పాటించాలనుకునే ప్రయాణికుడు రెండు సీట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జులై 24 నుంచి దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

* జర్మనీకి చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి తన ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌బ్యాక్‌లో రెండో తరం (సెకండ్‌ జనరేషన్‌) కారును ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.1.94 కోట్లు. ఐదు సీట్లుండే ఈ కారు వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తుందని ఆడి ఇండియా పేర్కొంది. ఇప్పటికే దీని బుకింగ్‌లు మొదలయ్యాయని తెలిపింది. అత్యుత్తమ సాంకేతికత, సామర్థ్యం, ఆకర్షణీయ డిజైన్‌తో కూడిన ఆర్‌ఎస్‌ 8 స్పోర్ట్‌బ్యాక్‌ను భారత్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉందని ఆడి ఇండియా హెడ్‌ బాల్బిర్‌ సింగ్‌ ధిల్లాన్‌ అన్నారు. వీ8 ట్విన్‌- టర్బో 4 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోలు ఇంజిన్‌ దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ ఇంజిన్‌ సాయంతో 3.6 సెకండ్లలోనే 100 కేఎంపీహెచ్‌ వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో ఆర్‌ఎస్‌ శ్రేణిలో మరిన్ని కార్లను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. మెర్సిడెజ్‌ బెంజ్‌ ఏఎంజీ ఈ 63ఎస్‌, బీఎండబ్ల్యూ ఎం5 కార్లకు ఈ సరికొత్త ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌బ్యాక్‌ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కారు కోసం ఆన్‌లైన్‌ ద్వారా లేదంటే సమీప ఆడి విక్రయ కేంద్రాల్లో బుకింగ్‌ చేసుకోవచ్చని ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌ఎస్‌ 7 స్పోర్ట్‌ బ్యాక్‌ మొదటి తరం కారును భారత్‌లో 2015లో ఆడి విడుదల చేసింది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో నమోదవుతన్నాయి. ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 208 పాయింట్లు లాభపడి.. 36,683 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగబాకి 10,806 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.97 వద్ద కొనసాగుతోంది. వివిధ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం వంటి అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.