గాయత్రీ మంత్రం:
“గాయతాం త్రాయతే ఇతి గాయత్రీ” అనగా జపించేవారిని తరింప జేస్తుంది కనుక ఈ మంత్రాన్ని గాయత్రీ అని అంటారు.
చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.
నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.
గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.
ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.