Politics

శరద్ పవార్‌కు భాజపా గాలం

శరద్ పవార్‌కు భాజపా గాలం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నా బీజేపీ మాత్రం ప్రభుత్వాల ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలనే రాజస్తాన్‌, మహరాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజస్తాన్‌లో మాత్రం బీజేపీకి గట్టి పరిణామాలే ఎదురైయ్యాయి. తిరుగుబాటు నేత సచిన్‌‌ పైలట్‌ రూపంలో వచ్చిన పెను విపత్తును రాజకీయాల్లో కాకలు తీరిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లత్‌ సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు. దీంతో సంకీర్ణ సర్కార్‌తో ఊగిసలాడుతున్న మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడినట్లు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి కాషాయ జెండా ఎగరేసే విధంగా కేంద్రంలోని అధికార పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ముందుగా ఎన్డీయేలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ పవార్‌కు ఇటీవల ఆహ్వానం సైతం పంపారు. కేం‍ద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో ఎన్సీపీ చేరితే దేశ, రాష్ట్ర అభివృద్దికి ఎంతో మంచిదని కేంద్రమంత్రి సెలవిచ్చారు. దీనిపై శరద్‌ పవార్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయని, మరికొంత కాలంలోనే ప్రభుత్వం కూలిపోవడం ఖయమని పలువురు బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు.