అటకలు, అరుగులు.. నట్టింట్ల ఆకాశమంత గచ్చు.. ఉమ్మడి కుటుంబాల జీవన సౌందర్యానికి ప్రతీక- పెంకుటిల్లు. తరానికీ తరానికీ మధ్య నిలువెత్తు వారసత్వం- పెంకుటిల్లు. ఒకదానిపై ఒకటిగా పేర్చిన గూనపెంకుల్ని చూస్తే మట్టిచేతికి ఎర్రగాజులు తొడికినంత అందంగా అగుపిస్తాయి. మనసంత విశాలంగా ఉన్న అరుగుల్ని చూస్తే కూచోకుండా వెళ్లిపోలేము. మండువేసవిలో అమ్మఒడి అంత చల్లగా సేదతీర్చేదీ.. వానాకాలంలో చూరు నుంచి నీటిదారాలను నేలపైకి జారవిడిచేదీ పెంకుటిల్లే. ఊరిలో మట్టిమిద్దె ఉంటే కలవారి కిందే లెక్క. దాని రాజసంతో వీధివీధంతా మెరవాల్సిందే.. కానీ కాలం మారింది.. పల్లెపల్లెనా కాంక్రీటు జంగిళ్లు మొలిచాక.. పెంకుటిల్లు చిన్నబోయింది. కుమ్మరిగూన, బొంబాయి గూన కానరాకుండా పోయాయి. ఇండ్లు కట్టించుకునేవారు లేరు.. కప్పేవారూ లేరు.. డాబాలొచ్చి మట్టిమిద్దెల్ని ఓ జ్ఞాపకంగా మార్చేశాయి. జిల్లాలో అక్కడక్కడా కనిపిస్తున్న పెంకుటిండ్లు గత వైభవానికి చివరి ఆనవాళ్లుగా మిగిలిపోయాయి.
* ఆధునిక కాలంలో పల్లెల్లో పెంకుటిండ్ల స్థానంలో ఆక్రమించిన కాంక్రీటు కట్టడాలకు, పాత తరం ఇండ్లకు మధ్య వ్యత్యాసం తెలిపే పద్య పంక్తులివీ. పెంకుటిండ్ల్లపై ఓ రచయిత కలం నుంచి జాలువారిన ఈ అక్షరాలు నూటికి నూరు శాతం కరెక్ట్. అన్ని రుతువుల్లోనూ మనిషిని చల్లగా కాపాడేది పెంకుటిల్లు. ఆడంబరాలకు దూరంగా సహజ సిద్ధమైన రీతిలో నిర్మించిన మట్టి గోడలు పెంకుటిండ్లకు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. కుటుంబాలు పెద్దవి కావడం, కాలక్రమేణా కుటుంబాల్లో చీలికలు రావడంతో పెంకుటిండ్లు నేడు ఒంటరవుతున్నాయి. ఉద్యోగరీత్యా ఇండ్లు వదిలి, ఊరుకు దూరంగా బతుకీడుస్తున్న జీవులకు పల్లెకు ఎప్పుడు వచ్చినా తల్లి లాంటి ప్రేమను పంచేది మాత్రం పెంకుటిల్లే. ఇంకు లేకుండా పెన్ను… పెంకు లేకుండా ఇల్లు.. సమస్యల్లేకుండా మనిషి లేడు అనేది నానుడి. ఆనాటి ఇండ్లు నేటికీ చెక్కు చెదరకుండా దర్పంతో కనిపిస్తూ పల్లెలకు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
**ఆకట్టుకునే దూలాలు
పెంకుటిల్లుకు దూలాలే ఆధారం. దూలాలుగా టేకు కలపనే వాడేవారు. గ్రామాల్లో పుష్కలంగా కలప దొరికే రోజుల్లో పెంకుటిండ్ల నిర్మాణానికి భారీగా కలపను వినియోగించే వారు. పక్కా గోడలతో కట్టబడి, పైభాగంలో కలపతో నిర్మించి వాటిపై పెంకులు కప్పడం ద్వారా ఎంతో రక్షణగా ఉంటుంది. పెంకుటింటి లోపలి భాగంలో గదులుగా చేసి అవసరాలకు తగ్గట్లు వాడుకునేవారు. ఒక నమూనా ప్రకారం కనీసం నాలుగు గదులు కలిగి ఉంటాయి. నివాస స్థలం, వంటకోసం వంట గది, నిద్ర పోవడానికి పడక గది, స్నానాల గది ఉంటాయి. పెంపుడు జంతువుల కోసం గూడు, కారు వంటి వాహనాల కోసం గ్యారేజీ నిర్మించుకునేవారు. పెద్దపెద్ద ఇండ్లల్లో అటకలు ఉండేవి. పాత వస్తువులు, ఎక్కువగా ఉపయోగించని వస్తువులను పెట్టుకోవడానికి అటకను వాడుకునేవారు. ఎత్తుగా, ఇంటి పైకప్పు పైభాగంలో ఉండే అలమర. స్నానం చేసేందుకు స్నానాల గది ఇంటికి దూరంగా కట్టేవారు. ప్రస్తుతం ఇంటిలో భాగమై పోయాయి.
**ఒక పెంకుటిల్లు.. అనేక ప్రయోజనాలు
సంప్రదాయబద్ధమైన పెంకుటిండ్లు మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుంది. మూడు దశాబ్దాల క్రితం వరకూ పెంకుటిండ్ల నిర్మాణాలు జోరుగా సాగేవి. పాత ఇండ్లలో మనిషి తన కోసం మాత్రమే ఇంటిని కట్టుకునేది కాదు. తనతో పాటుగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలు, పక్షులకు ఇందులో చోటు దక్కేది. చిన్న పాటి గూడు, దొడ్డి, కొట్టం వంటి నిర్మాణాలు ఇందులోనే అంతర్భాగంగానో లేదంటే మట్టి ఇండ్లకు ఆనుకునో ఉండేవి. వాటిని దైవంతో కొలిచే సంస్కృతి ఉండడంతో మట్టి ఇండ్ల పక్కనే వాటికి చోటును ఇచ్చిన సందర్భాలెన్నో. మరోవైపు పెంకుటిల్లు నిర్మాణంలో అనేక జాగ్రత్తలు కనిపిస్తాయి. వాస్తు దోషం మచ్చుకూ కనిపించదు. గాలి, వెలుతురు నిండుగా వచ్చే విధంగా ఇంటి నిర్మాణం డిజైన్ చేసే వారు. మట్టి గోడలైతే ఏనుగంత బలంగా ఉండేవి. సంపన్న వర్గాలైతే పెంకుటిండ్లనే రెండు అంతస్తులతో కట్టించుకొని దర్పం చూపించుకునే వారు. పెద్ద పెంకుటిండ్లలో చేద బావి అంతర్భాగంగానే ఉండేది. కొంత మంది ఇంటి బయట తవ్వించుకునేవారు. నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లే అవసరం లేకుండా చేద బావినే వాడుకునేది.
**ఆ పాత మధురం
ఆధునిక సమాజ పోకడల ప్రభావం ఎంతగా ఉన్నప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న వారు గ్రామాల్లో లేకపోలేదు. అలాంటి వ్యక్తులు తమ తాతల కాలం నాటి పెంకుటిండ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అనేక మంది పల్లెలను వదిలి పట్నం వెళ్లి స్థిరపడ్డారు. తిరిగి ఊరు ముఖం చూడకపోవడంతో మట్టి గోడలు ఎండకు ఎండి, వానకు తడిసి కూలి పోయాయి. ఆ పాత మధురమైన ఇంటి గొప్పతనాన్ని గ్రహించిన వారెందరో పెంకుటిండ్లకు మోడ్రన్ హంగులతో తీర్చిదిద్ది నివాస యోగ్యంగా మలుచుకుంటున్నారు. పట్నంలో బిజీ జీవితం గడిపే వారంతా నెలకోసారి ఇంటికొచ్చి మట్టి గోడల మధ్య సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక గ్రామాల్లో పెంకుటిండ్ల సౌందర్యం అద్భుతంగా కనిపిస్తోంది. మట్టి గోడలపై కప్పిన ఎర్రటి పెంకులు ధగధగా మెరుస్తూ గ్రామాలకు అందాన్ని తీసుకొస్తున్నాయి. పల్లెల్లో రూ.లక్షలు వెచ్చించి డూప్లెక్స్ ఇంటిని కట్టుకున్నా మట్టి ఇంటి ముందు దిగదుడుపేనన్న సత్యాన్ని చాలా మంది ఇప్పుడు గ్రహిస్తున్నారు. నిజామాబాద్ వంటి నగరంలోనూ ఒకప్పుడు సిటీలో యాభై శాతానికి పైగా ఇండ్లు మట్టి గోడలవే. వీటి స్థానంలో నేడు బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలిశాయి. నేటికీ కోటగల్లి, మిర్చీ కంపౌండ్, నాందేవ్‌వాడ, దుబ్బా, సుభాష్‌నగర్, ఎల్లమ్మగుట్ట వంటి ప్రాంతాల్లో పాత కట్టడాలు ఠీవీగా దర్శనమిస్తుంటాయి.
పెంకుటింటి అందమే వేరు
Related tags :