DailyDose

₹1000కోట్లు చెల్లించాయి-వాణిజ్యం

Business News Roundup - Voda Idea Pays Off 1000Crores

* వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వానికి మరో రూ.1000 కోట్ల బకాయిలను చెల్లించింది. దీంతో ఈ కంపెనీ చేసిన మొత్తం చెల్లింపులు రూ.7,854 కోట్లకు చేరాయి. అంతక్రితం మూడు దశల్లో రూ.6854 కోట్లను కంపెనీ డిపాజిట్‌ చేసినట్లు వొడాఫోన్‌ ఐడియా ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల(ఏజీఆర్‌) బకాయిలకు సంబంధించి తాజాగా మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు అందులో వివరించింది. జులై 20న ఏజీఆర్‌ అంశంపై సుప్రీం కోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో ఈ చెల్లింపులు జరగడం గమనార్హం. ఈ కంపెనీ మొత్తం మీద రూ.58,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా..టెలికాం కంపెనీలన్నింటికి కలిపి రూ.1.6 లక్షల కోట్ల వరకు బకాయిలున్న విషయం విదితమే.

* ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.6,659 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,568.16 కోట్లతో పోలిస్తే లాభం 20 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.32,361.84 కోట్ల నుంచి పెరిగి రూ.34,453.28 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూపేణా రూ.15,665.40 కోట్లు వచ్చాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలోని రూ.13,294.30 కోట్లతో పోలిస్తే ఇది 17.8 శాతం ఎక్కువ. ‘ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం కొనసాగడంతో తక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడం తగ్గింది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగమూ పరిమితంగానే ఉంది. దీనికి తోడు కొన్ని రుసుములను మాఫీ చేయడంతో ఇతర ఆదాయం రూ.2000 కోట్ల మేర తగ్గింద’ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు 1.4% నుంచి 1.36 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 0.43 శాతం నుంచి తగ్గి 0.33 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఇతరత్రా అవసరాలకు కేటాయింపులు రూ.2,631.66 కోట్ల నుంచి పెరిగి రూ.3,891.52 కోట్లకు చేరాయి.

* ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేర్ల విభజన ప్రతిపాదనపై నిర్ణయాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డు వాయిదా వేసింది. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ‘షేర్ల విభజన ప్రతిపాదనతో ఒనగూరే లాభనష్టాలపై బోర్డు విస్తృతంగా చర్చ జరిపింది. గత కొన్ని నెలలుగా షేర్ల కదలికలు, ఆర్థిక ప్రామాణిక సూచీలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం షేర్ల విభజనకు అంత అనుకూల పరిస్థితులు లేవని భావించి ఈ ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేసింద’ని ఎక్స్ఛేంజీలకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. కొవిడ్‌-19 సంక్షోభంతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న విషయాన్ని కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుందని తెలిపింది. షేర్ల విభజన ప్రతిపాదనపై మళ్లీ ఏ తేదీన చర్చిస్తామనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

* కరోనా వైరస్ తర్వాత ప్రజలకు ఆహార భద్రత కల్పించడం అత్యంత ముఖ్యమైన పని అని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడంలో ఆహార వ్యవస్థను బలోపేతం చేసి.. భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనేట్లు తీర్చిదిద్దడం కీలకమని పేర్కొన్నారు. ఆహార వ్యవస్థ మనుషులు, పశువులు, ఆర్థిక, పర్యావరణానికి అత్యంత కీలకమైంది. ‘మనం ఆర్థిక వ్యవస్థలు ఆహారానికి ప్రధాన్యం ఇస్తూనే సంస్కరణలను చేపట్టాలి’ అని ఐఎంఎఫ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. చాలా దేశాల్లో ఆహార ధాన్యాలను పండించే పరిస్థితి లేదని.. పేర్కొంది. ప్రధానంగా కూలీలను ఆపేయటం కానీ, లేదా వారు జబ్బుపడటంగానీ జరిగింది. మరోపక్క రెస్టారెంట్లు, బార్లు మూతపడటంతో భారీగా ఆహార వృథాకూడా జరుగుతోందని వెల్లడించింది. భవిష్యత్తులో భయంకరమైన ఆహార కొరత వస్తుందని ఐరాస అంచనావేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

* కరోనా కారణంగా ద్విచక్ర వాహనాల పరిశ్రమ స్వల్పకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే మొత్తం మీద భారత దీర్ఘకాల వృద్ధి, ద్విచక్ర వాహన పరిశ్రమ బలంగా, సానుకూలంగానే కనిపిస్తోందని హీరో మోటోకార్ప్‌ తన వార్షిక నివేదిక 2019-20లో తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీకి వృద్ధి అవకాశాలు భారీగానే ఉన్నాయని సంస్థ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా స్వల్పకాల వ్యాపార భవిష్యత్‌ అంచనాలు అనిశ్చితిగా కనిపిస్తున్నాయి. అయితే ద్విచక్ర వాహన పరిశ్రమ మాత్రం బలంగా కనిపిస్తోంద’ని ముంజాల్‌ అన్నారు. ‘గత అయిదేళ్లుగా 40 దేశాలకు పైగా విస్తరించాం. ఆర్‌ అండ్‌ డీలో ఇతరులు పెట్టిన పెట్టుబడులకు రెండింతలు పెట్టాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల సమ్మిళిత విక్రయాలు సాధించి ఒక చరిత్రాత్మక మైలురాయిని, ప్రపంచ రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామ’న్నారు. కంపెనీ రుణ రహితంగా కొనసాగుతోందని.. బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ ఇందుకు కారణమని ఆయన అన్నారు.