Editorials

AUతో MN Roy అనుబంధం

The connection between Andhra University and MN Roy

1937లో మొదటి పర్యాయం ఆంధ్రలో పర్యటించిన మానవేంద్రనాథ్ రాయ్ లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు ఆహ్వానంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టారు. అంతకుముందు వెన్నెలకంటి రాఘవయ్య కోరికపై నెల్లూరులో దక్షిణభారత వ్యవసాయ కూలీల సభను ప్రాంభించారు.

కాంగ్రెస్ వాదిగా ఆంధ్రాయూనివర్సిటీకి వచ్చిన రాయ్ ను నాటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డికి అబ్బూరి పరిచయం చేశారు. రాయ్ మేథస్సు పట్ల అబ్బురపడిన ఆర్. రెడ్డి ఆంధ్రాయూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్ గా చేరమని ఆహ్వానించారు. రాయ్ మర్యాదగా నిరాకరించారు. కాని సిఆర్ రెడ్డి అప్పటి నుండీ రాయ్ జైలు నుండి రాసిన లేఖలు చదివి ఆశ్చర్యపడి, వాటికి చాలా చక్కటి పీఠిక రాశారు. అది ప్రచురితమై ప్రాచుర్యం పొందింది.

అప్పటి నుండీ తరచు విశాఖకు రావడం రాయ్ కు ఆనవాయితీ అయింది. తొలుత వచ్చినప్పుడు స్టేషన్ లో అబ్బూరి వరదరాజేశ్వరరావు, పి.హెచ్.గుప్త అత్తలూరి నరసింహారావు, అబ్బూరి గోపాలకృష్ణ, స్వాగతం పలికారు. మహారాణి పేటలోని తన గృహంలో వుండమని గుప్త ఆహ్వానించారు.

మరొక గొప్ప విశేషం రాచకొండ విశ్వనాథశాస్త్రి అప్పుడు విద్యార్థిగా రాయ్ పట్ల ఆకర్షితుడై, సముద్రతీరాన ఎ.వి.ఎన్. కళాశాల పక్షాన బహిరంగ సమావేశం జరిపించారు. దాదాపు పది సంవత్సరాలు రాయ్ శిష్యుడుగా రాచకొండ వుంటూ రాయ్ సాహిత్యాన్ని, పత్రిక ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇండియాను తెప్పించారు. రాయ్ పట్ల తాను ఆకర్షితుడు కావడాన్ని డైరీలో రాశారు.

నెల్లిమర్ల జూట్ మిల్ కార్మిక సంఘ నాయకుడు పెమ్మరాజు వెంకటరావు, విజయనగరం మునిసిపల్ ఛైర్మన్ తాతా దేవకీనందన్, పార్వతీపురం శాసనసభ్యుడు చీకటి పరశురాం నాయుడు వున్నారు.

అబ్బూరి రామకృష్ణారావు ఉత్తరోత్తరా రాష్ట్ర రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఆర్గనైజర్ గా తీవ్ర కృషి చేశారు. ఆ ప్రభావంతోనే తన మనవడికి ఎం.ఎన్.రాయ్ అని పేరు పెట్టారు (ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు జడ్జి)

ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఎన్.రాయ్ ప్రభావితులైనవారిలో రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి, కోనేరు రామకృష్ణారావు వున్నారు.

ఫిలాసఫీ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి ఆయన రాసిన భారతీయ తత్వ శాస్త్ర పరిణామ రచనకు ఎమ్.ఎన్.రాయ్ చే సుదీర్ఘమైన పీఠిక రాయించుకున్నాడు. ఇది ఆంధ్రాయూనివర్సిటీలో వుండగా జరిగింది.