Sports

ప్రపంచ చదరంగ దినోత్సవ ప్రత్యేకం

World Chess Day Special Story - Telugu Sports News

రాజుగారి సభకి ఓ వేదపండితుడు వచ్చాడు. ‘పాండిత్యం సరే, నాతో ఓ ఇరవై ఎత్తులు చదరంగం ఆడి నిలువు, కోరినంత ధనమిస్తాను’ అన్నాడు రాజు పండితుడితో. ఇరవై ఎత్తులూ అయ్యాయి. పండితుడి ప్రతిభకు మెచ్చిన రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘రాజా చదరంగంలో 64 గళ్లున్నాయి. మొదటి గడిలో ఒకటీ, రెండో గడిలో రెండూ, మూడులో నాలుగు చొప్పున రెట్టింపు చేసుకుంటూ చివరికి వచ్చినన్ని ధాన్యం గింజలు ఇప్పించండి చాలు’ అన్నాడు పండితుడు వినమ్రంగా. ‘ఓస్‌ అంతేనా’ అనుకున్న రాజు ఆ పని మంత్రికి అప్పజెప్పాడు. అది ఎంతవుతుందో లెక్కవేయించిన మంత్రికి నోట మాట రాలేదు. అంత ధాన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు మహాప్రభో అంటూ రాజుకు విన్నవించుకున్నాడు. అరవై నాలుగు గళ్ల ఈ ఆట వెనక ఇలాంటి ఆసక్తికరమైన కథలే కాదు, ఎంతో ఘన చరిత్రా ఉంది. జులై 20 ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా…
**క ళ్లముందు కనిపించేది నలుపు తెలుపు గళ్లే. కానీ ఒకసారి పావుల్ని కదపడం మొదలు పెడితే ఆటగాడు తనని తాను మర్చిపోతాడు. రాజ్యాలు లేని రాజులూ రాణులూ వారి సైన్యాలూ..! అదో రణరంగం. మొదటి ఎత్తు నుంచి ఆఖరి ఎత్తు వరకు హోరాహోరీగా సాగే పోరాటం. మెదడుకు పనిచెబుతూ… వ్యూహాలకు పదును పెడుతూ… 64 గళ్లలో అనంతమైన యుద్ధ తంత్రాల్ని ఆవిష్కరించే అద్భుతమైన ఆట చెస్‌! ఇందులో మొదటి ఎత్తు 20 రకాలుగా వేయొచ్చు. ప్రత్యర్థి 20 రకాలుగా బదులివ్వొచ్చు. అంటే మొదటి ఎత్తు పూర్తి చేయడానికి 400 రకాల అవకాశాలున్నట్లు లెక్క. మొదటి ఎత్తు తర్వాత బలగాల కదలికలో మార్పు వస్తుంది కాబట్టి ఈ ఎత్తును 25 రకాలుగా వేయొచ్చు. అంటే 400×25=10000 రకాలు. ప్రత్యర్థి కూడా 25 రకాలుగా ఎత్తు వేయొచ్చు. కాబట్టి తొలి రెండు ఎత్తులు పూర్తవడానికి 2.5 లక్షల రకాల అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అవకాశాల పెరుగుదల ఇంకా ఎక్కువవుతుంది కాబట్టి మొదటి పది ఎత్తులు వేయడానికి 10 తర్వాత పది సున్నాలు చేరిస్తే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ అని గణిత శాస్త్రజ్ఞులు లెక్క తేల్చారు! మనిషి మేధోశక్తికి పరీక్ష పెట్టడంలో చెస్‌ను మించిన ఆట మరొకటి లేదు.
**మనదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా 196 దేశాల్లో ఆదరణ పొందిన చెస్‌ ప్రయాణంలో మలుపులూ విశేషాలు బోలెడు..
**మండోదరి కోసం..!
రావణుడు తన భార్య మండోదరికి యుద్ధం గురించి చెప్పడానికి ఈ ఆటను కనిపెట్టి నేర్పించాడనీ, ఎంతో తెలివైన మండోదరి తరచూ ఆ ఆటలో భర్తను ఓడించేదనీ చిన్నప్పుడు అమ్మమ్మ ఓ కథ చెప్పేదని విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓసారి చెప్పాడు. ఆ కాలంలో మహిళలకు యుద్ధ ప్రవేశం నిషిద్ధం కాబట్టి వారు యుద్ధ అనుభూతిని పొందేందుకు రూపొందించిన ఆట కావచ్చు ఇది! దీని ప్రస్తావన కౌటిల్యుడి అర్థశాస్త్రం లోనూ వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి వర్చువల్‌ వార్‌ గేమ్‌ ఇదేనన్నమాట. చరిత్ర ప్రకారమైతే గుప్తుల కాలంలో ఉత్తర భారతంలో చదరంగం మూలాలు ఉన్నాయి. రాజుల కాలంలో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, మనుషులతో చదరంగం ఆడేవారట! ఆరో శతాబ్దంలో చెస్‌ను ‘చతురంగ’ (సంస్కృతం) అనేవారు. కాలక్రమేణా అది చదరంగంగా మారింది. ఏడో శతాబ్దంలో భారత్‌ నుంచి పర్షియాకు వ్యాపించింది. క్రమంగా ఇతర దేశాలకూ విస్తరించి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆడుతున్న చెస్‌, దాని నిబంధనలు 15వ శతాబ్దంలో దక్షిణ యూరోప్‌లో రూపుదిద్దుకున్నాయి.
***ఆధునిక చదరంగం
పదిహేనో శతాబ్దం తర్వాత కొన్నేళ్లపాటు ‘రొమాంటిక్‌ చెస్‌’ ప్రజల్లోకి వెళ్లింది. త్వరగా సరదాగా ముగిసే ఆటని ఇష్టపడేవారనడానికి భార్యాభర్తలు చదరంగం ఆడుతున్న చారిత్రక చిత్రాలే నిదర్శనం. కొంతకాలం పాచికలు వేయడం ద్వారా పావులు కదుపుతూ డబ్బుపెట్టి చదరంగం ఆడిన ఆనవాళ్లూ ఉన్నాయి. అది జూదంలా మారిపోతోందని క్రమంగా పాచికలను తీసేసి చెస్‌ని ఆలోచనాత్మక క్రీడగా అభివృద్ధి పరిచారు. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్ధంలో ఆధునిక చదరంగం పోటీలు మొదలయ్యాయి. 1886లో మొట్టమొదటి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. విల్‌హెల్మ్‌ స్టైనిట్జ్‌ (ఆస్ట్రియా) తొలి ప్రపంచ ఛాంపియన్‌. 1924లో పారిస్‌లో తొలి ఒలింపియాడ్‌ జరిగినప్పుడే ప్రపంచ చెస్‌ సమాఖ్య (ఫిడె) ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకి మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. 1948 నుంచి ఓ పాతికేళ్లపాటు చెస్‌లో రష్యాకు ఎదురేలేదు. ఆ దేశ ఆటగాళ్లు బోత్నివిక్‌, వాసిలీ సిస్లోవ్‌, మైఖెల్‌ తాల్‌, టైగ్రాన్‌ పెట్రోసియన్‌, బోరిస్‌ స్పాస్కీలు ప్రపంచ చెస్‌ను శాసించారు.
**చూడకుండా ఆడవచ్చు!
ఫ్రెంచ్‌ ఆటగాడు ఫిలిడోర్‌కి రాత్రిళ్లు నిద్ర పట్టేదికాదు. దాంతో పడుకునే కళ్లు మూసుకుని చెస్‌ బోర్డును తలచుకుని ఊహల్లోనే ఆట ఆడేసేవాడట. ఆ అలవాటు అతడిని బోర్డు చూడకుండా ఒకేసారి ముగ్గురు ప్రత్యర్థులతో చెస్‌ ఆడి గెలిచేలా చేసింది. 1783లో అతడీ సామర్థ్యాన్ని ప్రదర్శించగా మర్నాడు పత్రికలన్నీ పతాకశీర్షికలతో ప్రశంసించాయి.సాధారణంగా చెస్‌ ఆడేవాళ్లు గళ్లలో ఉన్న పావుల్నీ వాటి కదలికల్నీ ఎన్నో కోణాల్లో ఊహించుకుని, తన ఎత్తుకి ప్రత్యర్థి స్పందన ఎన్ని రకాలుగా ఉండవచ్చో ఆలోచించుకుంటూ బోర్డునే చూస్తుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పావుల స్థానాల గురించి చెప్పే నొటేషన్‌ విని ఆట ఆడేస్తారు ఈ బ్లైండ్‌ఫోల్డ్‌ చెస్‌ నిపుణులు. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు ఆ విషయం మరో క్రీడాకారుడికి తెలియకుండా ఉండటం కోసం మొదలైన ఈ విధానం క్రమంగా ఒక ప్రత్యేక సామర్థ్యంగా మారింది. ఒకరితో కాదు, ఒకేసారి పాతిక, ముప్పై మందితో బ్లైండ్‌ఫోల్డ్‌ చెస్‌ ఆడగల క్రీడాకారులూ ఉన్నారిప్పుడు. హెచ్‌జెఆర్‌ ముర్రే రాసిన ‘ఎ హిస్టరీ ఆఫ్‌ చెస్‌’ పుస్తకంలో మరో రకం చెస్‌ గురించీ ఉంది. గుర్రం మీద పక్కపక్కనే స్వారీ చేస్తూన్న ఇద్దరు సైనికులు అసలు బోర్డూ పావులూ లేకుండానే నోటితో ఎత్తులను చెప్పుకుంటూ చెస్‌ ఆడేవారట. అయితే బ్లైండ్‌ ఫోల్డ్‌ చెస్‌ ప్రాచుర్యం పొందినట్టుగా ఈ ‘నోటిమాటతో ఆట’ ప్రజల్లోకి చేరలేదు. క్రామ్నిక్‌, ఆనంద్‌, షిరోవ్‌ లాంటి వాళ్లంతా బ్లైండ్‌ఫోల్డ్‌లోనూ రాణించారు.
**20వ శతాబ్దపు మ్యాచ్‌
దాదాపు పాతికేళ్లపాటు చదరంగంలో రారాజుల్లా వెలిగిపోయారు రష్యా ఆటగాళ్లు. వాళ్లకి నాటకీయంగా చెక్‌ పెట్టాడు అమెరికా వాసి బాబీ ఫిషర్‌. 20వ శతాబ్దంలోనే గొప్ప మ్యాచ్‌గా అభివర్ణించే 1972 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోరు ఐస్‌లాండ్‌ రాజధానికి 26కి.మీ. దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో జరిగింది. వరసగా రెండు రోజులూ అక్కడికి ఆలస్యంగా చేరుకుని రెండు పాయింట్లు కోల్పోయిన ఫిషర్‌ మూడో రౌండ్లో బోరిస్‌ను చిత్తుగా ఓడించాడు. అతడి ఆటకు ఫిదా అయిన బోరిస్‌ సైతం చప్పట్లు కొట్టి అభినందించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాయేతరుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం అదే ప్రథమం.
**చదరంగం ఇద్దరు మాత్రమే ఆడే ఆట కావటంతో ఛాంపియన్లుగా నిలిచే వ్యక్తులు యావత్‌ ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తారు. కాస్పరోవ్‌, కార్పొవ్‌లతో మొదలైన ఆ ప్రత్యేకత ఇప్పటికీ సాగుతోంది. క్లాసికల్‌ చెస్‌లో తిరుగులేని క్రీడాకారుడిగా, శతాబ్దపు అత్యుత్తమ క్రీడాకారుడిగాm పేరు తెచ్చుకున్న కాస్పరోవ్‌ తమ దేశానికే చెందిన కార్పొవ్‌ని ఎన్నోసార్లు ఓడించాడు. ఫిడెతో విభేదించి, ఇంగ్లాండ్‌కి చెందిన నిగెల్‌ షార్ట్‌తో కలిసి ప్రొఫెషనల్‌ చెస్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశాడు కాస్పరోవ్‌. దాంతో ఏటా ఇద్దరేసి ప్రపంచ ఛాంపియన్లు వచ్చేవారు. పదిహేనేళ్ల క్రితం మళ్లీ రెండు సంఘాలూ ఒక్కడవటంతో జగజ్జేతగా ఒక్కరి పేరే మార్మోగుతోంది.
**యంత్రంతో పోటీ
మనిషిలోని సహజ మేధస్సుకూ యంత్రాల కృత్రిమ మేధకూ మధ్య పోటీకి చదరంగం గొప్ప వేదికైంది. సూపర్‌ కంప్యూటర్లు, ఆటగాళ్ల మధ్య ఎన్నో ఆసక్తికర గేమ్‌లు జరిగాయి. ఎనభయ్యవ దశకంలో మొదలైన ఈ విధానంలో అత్యుత్తమ చెస్‌ ఆటగాళ్లను సైతం కంప్యూటర్లు ఓడించాయి. 1997లో డీప్‌ బ్లూ అనే సూపర్‌ కంప్యూటర్‌ అప్పటి ఛాంపియన్‌ కాస్పరోవ్‌నే ఓడించింది. ఆపై కంప్యూటర్లతో పోరాటాలను డ్రా చేసుకునే స్థాయికి ఆటగాళ్లు ఎదిగారు. 2002లో డీప్‌ ఫ్రిట్జ్‌ అనే యంత్రంతో పోరాడిన క్రామ్నిక్‌ ఆ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాత మనిషి, యంత్రం మధ్య ప్రపంచ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ కూడా నిర్వహించారు. రెండు టోర్నీలుగా సాగిన ఆ పోటీల్లో కంప్యూటర్లే విజేతలయ్యాయి. 2004లో కర్జకిన్‌ తొలిసారి కంప్యూటర్‌పై గెలిచాడు. అంతరిక్షానికి, భూమికి మధ్యా చెస్‌ పోటీలు జరిగాయి. 1970 జూన్‌ 9న తొలిసారి ఈ తరహా గేమ్‌ జరిగింది. రష్యా వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు భూమిపై ఉన్న ఆటగాళ్లతో తలపడ్డారు. ఆ మ్యాచ్‌ జరిగి 50 ఏళ్లయిన సందర్భంగా ఈమధ్య మరోసారి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న వ్యోమగాములు భూమిపై ఉన్న ఆటగాళ్లతో పోటీపడ్డారు. ప్రస్తుతం పలు దేశాల్లో ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలను నిర్వహిస్తున్నారు.
**మేధస్సును పెంచుతుంది
గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఒక దశలో మేధావులు చెస్‌ ఆడతారా లేక చెస్‌ ఆడితే మేధావులవుతారా అన్న చర్చ కూడా జరిగింది. చదరంగం మేధస్సును పెంచుతుందని పరిశోధనలూ రుజువు చేశాయి. అందుకే చాలా దేశాల్లో పాఠశాలల్లో చెస్‌ నేర్పిస్తారు. వెనిజువెలాలో పిల్లలకు చెస్‌ నేర్పించి చేసిన అధ్యయనంలో వారి ఐక్యూ పెరిగినట్లు గమనించారు. చదరంగం గురించి వివిధ పరిశోధనల్లో తేలిన మరికొన్ని లాభాలేమిటంటే… వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌, డిమెన్షియాలాంటి మతిమరపు వ్యాధుల్ని నివారించవచ్చు. మెదడులోని రెండు భాగాలకూ పని చెప్పే చెస్‌ వల్ల సొంతంగా ఆలోచించే శక్తీ సృజనాత్మకతా పెరుగుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో పఠనాసక్తినీ ఏకాగ్రతనీ పెంపొందిస్తుంది. సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యం వస్తుంది. పథకం ప్రకారం పని చేయడమూ దూరదృష్టీ అలవడతాయి.
**ఊరినే మార్చింది
కేరళలోని మరొట్టిచల్‌ అనే ఊళ్లో ఏ వీధిలో చూసినా అరుగుల మీద చెస్‌ ఆడుతూ కన్పిస్తారు. అక్కడ ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా చెస్‌ వచ్చు. ఒక గ్రామం ఇంతలా చదరంగ ప్రియులుగా మారడానికి కారణం చెడు వ్యసనాల నుంచి బయట పడాలనే సంకల్పమే. ఆ ఊరికే చెందిన ఉన్నికృష్ణన్‌ పట్నంలో చెస్‌ నేర్చుకున్నాడు. ఆ ఆట నేర్పి ఊరివాళ్లను వ్యసనాలకు దూరం చేయొచ్చనుకున్నాడు. ఊరికి మకాం మార్చాడు. అక్కడో టీకొట్టు పెట్టుకుని వచ్చిన వాళ్లకు చెస్‌ నేర్పించేవాడు. అతని ప్రయత్నం ఫలించింది. చెస్‌ అంటే ఇష్టం ఒకరి నుంచి ఒకరికి ఊరంతా పాకిపోయింది. తాగుడు, జూదం మర్చిపోయి చదరంగం బల్లకు కళ్లప్పగించడం మొదలెట్టారు. అలా చెస్‌ మొత్తంగా ఆ ఊరినే మార్చేసింది.
ఇప్పుడు నగరాల్లోనూ ‘స్ట్రీట్‌ చెస్‌’ ఆదరణ పొందుతోంది. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌ లాంటి నగరాల్లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే పార్కుల వద్ద ఒక బల్ల మీద చెస్‌ బోర్డు పెట్టుకుని నేర్పించేవాళ్లు కన్పిస్తారు. కాలక్షేపం కోసం ఆడేవాళ్లూ, పందెం కాసి ఆడేవాళ్లూ ఉంటారక్కడ. చెస్‌ ఆడే దేశాలన్నిట్లోనూ ఇప్పుడు వీధి చెస్‌ క్లబ్బులు తరచూ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాయి.