DailyDose

పడిపోయిన వెండి దిగుమతులు-వాణిజ్యం

Gold Silver Deposits Import Down In India - Telugu Business News

* భారత్‌లో తమ ఉనికిని పెంచుకునేందుకు మొబైల్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏడాది క్రితం రూ.199 నెలవారీ మొబైల్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. అందులో కేవలం స్టాండర్డ్‌ డెఫినిషన్‌ (ఎస్‌డీ)లో మాత్రమే వీడియోలను వీక్షించే వీలుంది. కొవిడ్‌-19 కారణంగా ఇప్పుడు ఓటీటీల వినియోగం పెరిగింది. జనం సైతం హై క్వాలిటీలో వీడియోలు వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీ కంటెంట్‌ను అందించేందుకు మరో మంత్లీ ప్లాన్‌కు సిద్ధమవుతోంది ఈ ఓటీటీ దిగ్గజం.

* దేశీయ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఐటీ షేర్ల అండతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో నిఫ్టీ మళ్లీ 11 వేల మార్కు అందుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 459 పాయింట్ల వరకు లాభపడింది. చివరికి 398.85 పాయింట్ల లాభంతో 37,418.99 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 120.50 పాయింట్లు లాభపడి 11,022 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.92గా ఉంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులు భారీగా అదుపులోకి వచ్చాయి. ఏప్రిల్‌-జూన్‌లో 68.80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5160 కోట్ల) విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయింది. 2019-20 ఇదే కాలంలో 1150 కోట్ల డాలర్ల (సుమారు రూ.86,250 కోట్ల) విలువైన పుత్తడి దేశంలోకి దిగుమతి అయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా 45 శాతం తగ్గి 57.50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4300 కోట్ల)కు పరిమితమయ్యాయి. కొవిడ్‌-19 సంక్షోభానికి తోడు, ధరలు బాగా పెరగడం కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు.

* బడ్జెట్‌ రేంజ్‌లో మొబైల్స్‌ అంటే వినిపించే పేర్లలో రెడ్‌మీ ఒకటి. నోట్‌ సిరీస్‌లో కొన్ని నెలల క్రితం ‘9 ప్రో’, ‘9 ప్రో మ్యాక్స్‌’ మొబైల్స్‌ తీసుకొచ్చిన రెడ్‌మీ… తాజాగా ఆ సిరీస్‌లో ‘నోట్‌ 9’ను లాంచ్‌ చేసింది. ‘ది అన్‌ డిస్‌ప్యూటెడ్‌ ఛాంపియన్‌’ అంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన రెడ్‌మీ టీమ్‌… అందుకు తగ్గ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో మొబైల్‌ను తీసుకొచ్చింది. 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 4 జీబీ ర్యామ్‌ + 128 జీబీ మెమొరీ, 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్లలో ఈ మొబైల్స్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

* కరోనా మహమ్మారి వేళ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఇండిగో ఉద్యోగులకు షాకిచ్చింది. సంస్థలో 10 శాతం సిబ్బందికి లే ఆఫ్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంక్షోభ సమయంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉన్న చివరి అవకాశంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో రొణొజాయ్‌ దత్తా వెల్లడించారు.