Devotional

రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం

రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం

ఈ మాసంలో నిత్యం విశేషాలే..
25న నాగుల పంచమి
ప్రతి మంగళవారం గౌరీ వ్రతాలు
ప్రతి శుక్రవారం వ్రతాలు, ఆగస్టు 1న వరలక్ష్మీ వ్రతం
3న రాఖీ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ
11న శ్రీకృష్ణాష్టమి
**భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది.. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం.. పండుగల మాసం అంటారు.. శ్రావణం ఆధ్మాత్మిక మాసం.. ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే.. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య లాంటి ఎన్నో విశిష్టమైన పండుగలు ఈ నెలలోనే రావడంతో ఈ మాసానికి ఎంతో విశిష్టత చేకూరింది. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనది. ఈ మాసమంతా ప్రతి ఇంట్లో నిత్య పూజలతో అలరారుతున్నది.. ఆలయాలన్నీ భక్తులలో కిక్కిరిసిపోతాయి.. ప్రతి ఆలయం ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో సందడిగా మారనున్నది.
**శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే.. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకున్నది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెబుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసం ప్రత్యేకలు, ఆచరించాల్సిన నియమాలు మీకోసం..
*సోమవారం
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ముక్తి ప్రధాత ముక్కంటికి సోమవారం ప్రీతికరమైనది. ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు, అర్చనలతో నమస్కరిస్తే శుభాలు కలిగి సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.
*మంగళవారం
అభయమిచ్చే హనుమంతుడు. సకల విఘ్నాలను తొలగించి సకల దేవతల కంటే ముందే మొదటి పూజలందుకునే విఘ్నేశ్వరుడు.. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మేశ్వరుడు మంగళవారం నాడే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరీకి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఆయా దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలను ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.
*బుధ, గురువారంబుధ, గురువారం
బుధ, గురు వారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. బుధవారం అయ్యప్పకు ప్రీతికరమైనది. గురువారం రాఘవేంద్రస్వామి, దక్షిణమూర్తి, సాయిబాబాకు ప్రీతికరమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రోజున ఆయా దేవతలను, గురువులను కొలిచిన, దర్శించుకున్న సకల శుభాలు కలుగుతాయి.
*శుక్రవారం
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైనది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శుభప్రదమైనది. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లె మాలను సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే రుణ విముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అదే విషయాన్ని పండితులు కూడా చెబుతున్నారు.
*శనివారం
కలియుగ దైవం శ్రీనివాసుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శనివారం. ఈ రోజున ఉపవాస దీక్షలు చేపడుతారు. స్వామివారికి పుష్పార్చనలు చేస్తారు. తులసీ దళాల మాలలు సమర్పిస్తారు. ఇలా ప్రతి శనివారం చేస్తే కోరిన కోరికలు తీరి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.
*శ్రావణ మాసంలో వచ్చే పండుగలు
శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం. ఆ తర్వాత నాగుల చవితి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి ఈ మాసంలోనే వస్తాయి.
*మంగళగౌరీ వ్రతం
ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులు, పెండ్లికాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైనది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తోర శతనామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖసంపదలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పెండ్లి కాని వారికి వివాహం అవుతుందన్నది ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
*నాగుల పంచమి
శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, పంచమిని జరుపుకొంటారు. ఈ రెండు రోజులతో పాటు, శ్రావణ శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
*వరలక్ష్మీ వ్రతం
నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరల క్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.
*శ్రావణ పూర్ణిమ
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్‌, జంద్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. ఇదే రోజున సంతోషిమాత జయంతి కావడం ఎంతో విశిష్టత. మాతను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది హిందువుల నమ్మకం.
*శ్రీ కృష్ణాష్టమి
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్టుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తున్నదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పల్లె, పట్టణాల్లో ఉట్టి సంబురాలు, చిన్నారులను గోపికలు, చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.