Movies

అతని మృత్యువు…నా బాగోగులు…

అతని మృత్యువు…నా బాగోగులు…

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత హీరోయిన్‌ తాప్సీ బాగోగుల గురించి తెలుసుకునేవారి సంఖ్య సడన్‌గా ఎక్కువైపోయిందట. సుశాంత్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ (బంధుప్రీతి)ను ప్రోత్సహించేవారే పరోక్షంగా కారణమంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ ఒక అవుట్‌సైడర్‌ (అంటే ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడం). ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి జోరుమీద ఉన్న తాప్సీ కూడా అవుట్‌సైడర్‌.అందుకే అవుట్‌సైడర్‌గా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటూ తాప్సీకి ఫోన్‌ కాల్స్‌ ఎక్కువైపోయాయి. ఈ విషయంపై తాప్పీ స్పందిస్తూ – ‘‘సుశాంత్‌ను నేనెప్పుడూ కలవలేదు. కానీ అతను మరణించిన రోజు (జూన్‌ 14) నుంచి నాకు ‘ఆర్‌ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా? సంతోషంగానే ఉంటున్నావా? ఏవైనా విషయాలు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నావా?’ అంటూ నాకు రోజు ఫోన్లు, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అమ్మానాన్న ఢిల్లీలో ఉంటారు. నేను, నా చెల్లులు ముంబైలో ఉంటాం. మాతో పెద్దవాళ్లెవరూ లేరని మా ఇరుగు పొరుగు వారు కూడా నాపై ఓ ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తున్నారు. ‘నువ్వు ఇక్కడి అమ్మాయివి కాదు. మీ తల్లిదండ్రులు నీతో లేరు. నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాతో చెప్పుకో’ అనడం నాకు కొత్తగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌లో అవుట్‌సైడర్స్‌ చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారు.దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారు’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే…. నెపోటిజమ్‌ డిస్కషన్స్‌లో భాగంగా హీరోయిన్స్‌ తాప్సీ, స్వరా భాస్కర్‌లను ‘బీ గ్రేడ్‌ యాక్టర్స్‌’ అని అన్నారట కంగనా రనౌత్‌. ఈ విషయంపై తాప్సీ ట్వీటర్‌ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్‌ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్‌ కూడా వచ్చాయని విన్నాను.మా గ్రేడ్‌ సిస్టమ్‌ అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్‌ సిస్టమ్‌ అనుకున్నానే!’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు తాప్సీ. కరణ్‌ జోహార్‌ వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడని కంగనా విమర్శిస్తున్నారు. కరణ్‌ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండూ లేని తాను బాలీవుడ్‌లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ అనడం కంగనాకి మింగుడుపడలేదు. అందుకే తాప్సీ బీ గ్రేడ్‌ యాక్టర్‌ అని కంగనా అనడం, తాప్సీ సమాధానం ఇవ్వడం జరిగింది.