Health

మూడురోజుల్లో లక్ష కరోనా కేసులు-TNI బులెటిన్

మూడురోజుల్లో లక్ష కరోనా కేసులు-TNI బులెటిన్

* తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం  కొనసాగుతోంది.ఏపీలో  అత్యధికంగా తూర్పుగోదావరిలో ఇప్పటి వరకు 7,543 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కరోనా బారిన పడి  మరో తొమ్మిది మంది మరణించడంతో మృతుల సంఖ్య 65కు చేరింది.జిల్లాలో ప్రతిరోజూ 7వేల వరకూ వైద్య  పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మురళీధరరెడ్డి తెలిపారు.జిల్లాలో  రానున్న రెండు వారాల్లో  కొవిడ్ వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. ఒక  ప్రాంతంలో ఏదో  ఒక సందర్భంలో కరోనా కేసులు అత్యధిక స్థాయికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని చెప్పారు.జిల్లాలో కరోనా అత్యధిక కేసుల సమయం ఆగస్టు 25గా అంచనా  వేస్తే ముందుగానే వచ్చిందని అన్నారు.రానున్న  రెండు  వారాలు  జిల్లా ప్రజలు కరోనా జాగ్రత్తలపై హైఅలర్ట్‌గా ఉండాలని కలెక్టర్ మురళీధరరెడ్డి సూచించారు. 

* బెల్లంకొండ పోలీస్ స్టేషన్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్..గుంటూరు జిల్లా బెల్లంకొండ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సోమవారం ఎస్ఐ రాజేష్ తెలిపారు.స్టేషన్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న సిబ్బంది టెస్ట్ లు చేయించుకోగా వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.ఎంపీడీవో గబ్రూనాయక్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో పంచాయితీ సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపట్టారు.

* భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 35 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో లక్ష కేసులు నమోదవడానికి కేవలం మూడ్రోజులే పడుతోంది. అయితే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ ధ్రువీకరించిన టెస్టింగ్‌ సంస్థల్లో ఒకటైన థైరోకేర్‌.. యాంటీబాడీలపై ఓ నివేదికను వెల్లడించింది. దేశంలో దాదాపు 18 కోట్ల మందిలో ఇప్పటికే కరోనావైరస్‌కు వ్యతిరేంగా ప్రతినిరోధకాలు(యాంటీబాడీలు) అభివృద్ధి అయినట్లు ఆ సంస్థ పేర్కొంది.

* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్‌లాక్‌ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

* తిరుపతిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనాల సంఖ్యను తితిదే కుదిస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలిపి 12వేల టికెట్లు తితిదే జారీ చేస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశదర్శనానికి 9వేల టికెట్లు, నేరుగా వచ్చి కొనుగోలు చేసేందుకు వీలుగా ఆఫ్‌లైన్‌ ద్వారా 3వేల టికెట్లను ఇప్పటి వరకు తితిదే జారీ చేసింది.