రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంట అయిన మక్కలో, సస్యరక్షణ చర్యలపై జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించారు. మక్కను ఆశించే పురుగులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారు వివరించారు.
*** లద్దె పురుగు :
ఈ పురుగులు ఆకులపై ఉండే పచ్చని పదార్థాన్ని తినడం వల్ల ఆకుల్లో చీరికలు ఏర్పడుతాయి. కండెలను కూడా ఆశించి, పంటను నష్టపరుస్తాయి. దీని నివారణ కోసం..పురుగులు చిన్నగా ఉన్నప్పుడే ఒక లీటరు నీటికి క్వినాల్ఫాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలను అదుపు చేసేందుకు వరి తవుడు ఐదు కిలోలు, బెల్లం అరకిలో, మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాన్ 500 మి.లీ. తగినంత నీటిలో కలిపి, ఉండలుగా తయారు చేయాలి. వీటిని సాయంకాలంలో పొలంలో చల్లాలి. లేదా ఒక లీటరు నీటికి థయోడికార్బ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
*** కాండం తొలుచు పురుగు :
10 నుంచి 20 రోజుల పైరును ఈ పురుగు ఆశిస్తుంది. మొక్కలో ఎదిగే అంకురాన్ని లార్వాలు తినడం వల్ల మొవ్వు చనిపోయి, గొడ్డు మొక్కగా మారుతుంది. దీని నివారణ కోసం…ఒక లీటరు నీటిలో మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 20 ఎస్.సీ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. 25 నుంచి 30 రోజుల పైరుకు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి మూడు కిలోల చొప్పున మక్క ఆకుల సుడులలో వేయాలి.