WorldWonders

మధ్యప్రదేశ్‌లో భారీ వజ్రం లభ్యం

మధ్యప్రదేశ్‌లో భారీ వజ్రం లభ్యం

మధ్యప్రదేశ్‌లోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. పన్నా జిల్లాలో 10.69 క్యారెట్ల వజ్రం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. రాణిపూర్‌ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్‌ కుష్వాహా (35) 10.69 క్యారెట్ల వజ్రాన్ని స్థానిక వజ్రాల కార్యాలయంలో జమచేసినట్లు పన్నా వజ్రాల అధికారి ఆర్.కె.పాండే తెలిపారు. ఈ విలువైన రాయిని వేలం వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తరువాత ఆదాయాన్ని డిపాజిటర్‌కు ఇస్తామని స్పష్టం చేశారు. వజ్రం విలువను తేల్చాల్సి ఉంది. దాని నాణ్యత ఆధారంగా రూ.50 లక్షల విలువ చేస్తుందని స్థానిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆనందిలాల్‌ ఇటీవలే 70 సెంట్ల వజ్రాన్ని కూడా కార్యాలయంలో జమ చేశారు. కరోనా లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఇక్కడ లభ్యమైన మొదటి పెద్ద వజ్రం అని కుష్వాహా అన్నారు. తనతోపాటు తన భాగస్వామి ఆరు నెలలుగా గనిలో చాలా కష్టపడుతున్నామని, ఈ వజ్రం లభించినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యామని విలేకరులతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాల నిల్వలకు ప్రసిద్ధి చెందింది.