DailyDose

అమ్మకానికి టిక్‌టాక్-వాణిజ్యం

Business News Roundup - TikTok Ready To Sell The Company

* దుందుడుకు చైనాకు ముకుతాడు వేసేందుకు అన్ని దేశాలూ టిక్‌టాక్‌ను పావుగా వాడుకుంటున్నాయి! దీంతో ఆ కంపెనీ మాతృసంస్థ ‘బైట్‌డాన్స్’కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భారత్‌ తరహాలోనే మున్ముందు మరిన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఆ కంపెనీ సన్నద్ధమైందని సమాచారం. ది న్యూయార్క్‌ టైమ్స్‌, ది ఇన్ఫర్మేషన్‌ వంటి వార్తా సంస్థలు ఇందుకు సంబంధించిన కథనాలు ఇస్తున్నాయి.

* దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 219 పాయింట్లు కోల్పోయి 37,912 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 11,150 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.53 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీలపై ప్రభావం చూపుతోంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో వాల్‌ స్ట్రీట్‌ సూచీలు సైతం కుంగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

* వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ గురువారం వెల్లడించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో ఆ వివరాలను తెలియజేయలేదు. వచ్చే నెల (ఆగస్టు) నుంచి ‘ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌’ పేరుతో టోకు వ్యాపార కార్యకలాపాలను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించనుంది. 650 బిలియన్‌ డాలర్ల పరిమాణం ఉన్న భారత రిటైల్‌ విపణిలోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్‌ ఈ లావాదేవీని చేపట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 28 ‘బెస్ట్‌ప్రైస్‌’ టోకు విక్రయకేంద్రాలను వాల్‌మార్ట్‌ ఇండియా నిర్వహిస్తోంది. కాగా.. వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని పెట్టుబడి సంస్థల బృందం నుంచి ఇటీవలే 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను ఫ్లిప్‌కార్ట్‌ సమీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే వాల్‌మార్ట్‌ ఇండియాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించడం గమనార్హం. ‘ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌.. డిజిటల్‌ రూపేణా అందుబాటులోకి రానున్న కొత్త వేదిక. భారత్‌లోని బిజినెస్‌- టు- బిజినెస్‌ (బి-టు-బి) విభాగం అవసరాలపై ఇది దృష్టిపెడుతుంది. ఓ వైపు విక్రయదార్లను, తయారీదార్లను మరోవైపు కిరాణా దుకాణాలను, ఎంఎస్‌ఎమ్‌ఈలను ఇది సమర్థంగా అనుసంధానం చేస్తుంద’ని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఆదర్శ్‌ మీనన్‌ అన్నారు. కిరాణా దుకాణాలు, ఎంఎస్‌ఎమ్‌ఈల అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొనుగోలు లావాదేవీ ఉపయోగపడనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే బీ-టు-బీ విభాగంలో ఇదే తరహా సేవల అందిస్తున్న అమెజాన్‌కు గట్టి పోట్టి ఇచ్చేందుకు కూడా ఇది దోహదం చేయనుంది. ‘పూర్తిగా తయారైన వస్తువుల బీ-టు-బీ విపణి విలువ 650 బిలియన్‌ డాలర్లుగా ఉందని అంచనా. ఇందులో 140 బిలియన్‌ డాలర్ల వ్యాపారంపై మేం దృష్టి సారించనున్నాం. ఇందులో ఫ్యాషన్, నిత్యావసరాలు, చిన్న, పెద్ద ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు లాంటివి ఉంటాయ’ని ఆయన అన్నారు.

* చైనాతో పాటు, భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి ప్రభుత్వ వినియోగం కోసం ఉద్దేశించిన వస్తువుల కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జనరల్‌ ఫైనాన్సియల్‌ రూల్స్‌-2017లో సవరణలు చేస్తూ గురువారం కేంద్ర వ్యయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకొంది. దీని ప్రకారం చైనాతో పాటు, ఇతర దేశాల గుత్తేదార్ల నుంచి వస్తువులు, సేవలు, పనులు పొందడం పరిమితులకు లోబడి ఉంటుంది. ఆయా దేశాల గుత్తేదార్లు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే టెండరు ద్వారా వాటిని సరఫరా చేయగలుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ నిబంధనను పాటించాల్సి ఉంది. ప్రయివేటు సంస్థలకు ఇది వర్తించదు.