కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్‌పై స్పష్టత వచ్చింది. సెప్టెంబర్ 19న ఈ మెగా ఈవెంట్ ప్రారంభమవుతుండగా, నవంబర్ 8న ఫైనల్‌తో ముగియనుంది. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి ఈ మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, యూఏఈలో టోర్నీ నిర్వహణకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉందని, అది కూడా త్వరలోనే పూర్తవుతుందని స్పష్టంచేశారు. అలాగే వచ్చేవారం నిర్వహించే ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని బ్రిజేశ్ పేర్కొన్నారు.
తొలుత మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో ఆ టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదని భావించిన బీసీసీఐ యూఏఈలో ఆడించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐసీసీ సోమవారం టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయడంతో ఐపీఎల్‌కు మార్గం సుగుమం అయింది. ఇక 2014లో సగం టోర్నీని యూఏఈలోనే నిర్వహించిన నేపథ్యంలో ఈసారి కూడా అక్కడే నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కాగా, ఈ టోర్నీ నిర్వహణకు శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం ఆసక్తి చూపించింది.