DailyDose

వైకాపాకు జనసేన శాపనార్థాలు-తాజావార్తలు

వైకాపాకు జనసేన శాపనార్థాలు-తాజావార్తలు

* ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయింది. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ఓపెన్ చేసి రెండు నిమిషాల్లో అయిపోయిందని చెబుతున్నారు. అది ఎవరికి వెళ్తుందో తెలీడం లేదు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇలానే జరిగితే తెదేపాకు తగిలినట్లే వైకాపాకూ ఇసుక దెబ్బ తగలడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. జనసేన సామాజిక మాధ్యమాలకు ఇచ్చిన పార్ట్‌-3 ఇంటర్వ్యూలో ఇసుక కొరత, ఈబీసీ రిజర్వేషన్ల రద్దు వంటి రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్, ప్రధాని దౌత్య సంబంధాలు వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.

* కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వమని.. కరోనా మహమ్మారి సమయంలో కూడా లాభాల కోసం చూస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు తీసుకువచ్చిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా జులై 9నాటికి రూ.429 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రకటనపై రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓ వైపు మహమ్మారి విరుచుకుపడుతోంది.. మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వం విపత్తుల సమయంలోనూ లాభాల్ని ఆశిస్తోంది.’ అంటూ రాహుల్‌ ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. రైల్వే ఆదాయానికి సంబంధించిన నివేదికనూ దీనికి జత చేశారు.

* కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరిందని విమర్శించారు. ప్రజారోగ్యంపై మాట్లాడమంటే అధికార పక్షం నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్‌ను కలిసి….ఆస్పత్రి తరలింపు, భవనం కూల్చివేత, వైద్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రి వార్డుల్లోకి నీరు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని ఇబ్బందులు, కూల్చివేతతోపాటు తదితర వివరాలను నేతలు తెలుసుకున్నారు.

* కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కరోనా మహమ్మారిపై అందరికీ అవగాహన అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని చెప్పారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ను కాపాడుకోవాలన్నారు.

* స్థానిక రైతులు సహకరిస్తే రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైతాబాద్‌ వెల్‌స్పన్‌ పరిశ్రమను సందర్శించిన ఆయన.. అందులో ఫ్లోరింగ్‌ టైల్స్‌ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల విభాగానికి భూమిపూజ చేశారు. హైతాబాద్‌లో స్థానిక యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

* గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడాన్ని నిరసిస్తూ అక్కడి నర్సింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ప్రాణాలకు తెగించి, విధులు నిర్వర్తిస్తున్నా.. ప్రభుత్వం కనీసం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొవిడ్‌ విభాగంలో ఉన్నవారికి మాత్రమే కిట్లు ఇవ్వాలన్న అధికారుల నిర్ణయం సరికాదన్నారు. సిబ్బంది అందరికీ వ్యక్తిగత రక్షణ కిట్లు, ఎన్‌95 మాస్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరారు.

* బడుగు, బలహీనవర్గాల ఉద్యమ నేత ఉప్పుటూరి సాంబశివరావు కరోనాతో మృతి చెందారు. బర్కత్‌పురాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. సామాజిక అణచివేత, వర్గ దోపిడీపై అయిదు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేశారు. గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉప్పుటూరి సాంబశివరావు ఉసాగా సుపరిచితులు. విద్యార్థి దశనుంచే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. ప్రజాతంత్ర విద్యార్థి సంఘంలో పనిచేశారు. 1982లో నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతంలో రైతు ఉద్యమనేతగా పనిచేశారు.

* వీసా విధానంలో కొత్త కొత్త మార్పులను తెస్తున్న అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో మాత్రమే బోధనను ఎంచుకుంటున్న కొత్త విద్యార్థులను ఇకపై దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* ఐపీఎల్‌-2020లో భాగస్వాములయ్యే క్రికెటర్లకు ప్రతి రోజూ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తే మంచిదని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని నెస్‌ వాడియా అన్నారు. ఒకవేళ తానే క్రికెటరైతే రోజూ పరీక్షలు చేయించుకొనేందుకు ఇబ్బంది పడనని పేర్కొన్నారు. యూఏఈలో ఎనిమిది జట్లతో బయోసెక్యూర్‌ వాతావరణానికి వీలవుతుందో లేదో చూడాలని వెల్లడించారు. ఈఎస్‌పీఎన్‌ క్రిన్‌ఇన్ఫోలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు మెరుగైతే టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావించింది.

* దేశ రాజధాని నగరం దిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సీఆర్పీఎఫ్‌ ఎస్సై తన పైఅధికారిని సర్వీసు తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో దిల్లీలోని 61 లోధ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని కేంద్ర హోంశాఖ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌లో ఎస్సైగా పనిచేస్తున్న కర్నైల్‌ సింగ్‌, పైఅధికారి, సహచరుడు దశరథ్‌ సింగ్‌ మధ్య వాగ్వాదం జరిగి అనంతరం కాల్పులకు దారితీసినట్టు భావిస్తున్నారు.

* కెరీర్‌లో విభిన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న యువ నటుడు దగ్గుబాటి రానా. ‘నేను వివాహం చేసుకునే సరైన సమయం ఇదేననుకుంటున్నా. నా ప్రేమికురాలు మిహీకా కుటుంబం మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మేమంతా ఒకే ప్రాంతంలో ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు సాఫీగా సాగిపోతుంటాయి. ఆమే నాకు కరెక్ట్‌ జోడీ. ప్రతి విషయంలోనూ ఒకరికొకరం అండగా ఉంటాం. ఆగస్టు 8న తనని వివాహం చేసుకోబోతున్నా. ఆ రోజు నా జీవితంలో అత్యుత్తమమైన, అద్భుతమైన రోజు’’ అని చెప్పుకొచ్చారు.

* ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని రాష్ట్రంలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకు తాను సుముఖంగా లేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురవుతున్నా ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థల మధ్య సమతూకం సాధించడం అవసరమని పేర్కొన్నారు. శివసేన పార్టీ అధికార పత్రికతో ఆయన మాట్లాడారు. ‘పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తానని నేనెప్పుడూ అనలేదు. కొద్దికొద్దిగా తెరుద్దామని చెప్పాను. ఒకసారి తెరిచాక మళ్లీ మూసేయొద్దన్నది నా ఉద్దేశం. దశలవారీగా వ్యాపారాలను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాను’ అని ఉద్దవ్‌ అన్నారు.

* ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయింది. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ఓపెన్ చేసి రెండు నిమిషాల్లో అయిపోయిందని చెబుతున్నారు. అది ఎవరికి వెళ్తుందో తెలీడం లేదు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇలానే జరిగితే తెదేపాకు తగిలినట్లే వైకాపాకూ ఇసుక దెబ్బ తగలడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. ఇసుక కొరత, ఈబీసీ రిజర్వేషన్ల రద్దు వంటి రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్, ప్రధాని దౌత్య సంబంధాలు వంటి అంశాలపై పవన్‌ మాట్లాడారు.