* కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఆ నిబంధనలను సడిలిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈనెల 31తో అన్‌లాక్ 2.0 ముగియనుంది. ఇప్పటికే చాలా నిబంధనలు సడలించిన ప్రభుత్వం మరి కొన్నింటిని కూడా సడలించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.
* కార్గిల్ యుద్ధంలో సైనికులు చూపిన ధైర్య పరాక్రమాలు ఎప్పటికీ మరువలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాని కొనియాడారు. మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. సైనికుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని.. వారి శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. సైనికుల త్యాగాలను దేశంలోని యువకులు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ కుట్రపూరితంగా భారత్ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడంవల్లే కార్గిల్ యుద్ధం సంభవించిందని విమర్శించారు. భారత్ మాత్రం ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోందన్నారు.
* భూపాలపల్లి జిల్లా మల్లారంలో ఇటీవల జరిగిన దళిత యువకుడి హత్యను నిరసిస్తూ కాంగ్రస్ చేపట్టిన చలో మల్లారం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి మల్లారానికి బయల్దేరిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని జనగామ వద్ద పోలీసులు అడ్డుకొని ఘనపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అడ్డుకొని రఘునాథపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా కాంగ్రెస్ నాయకులను కాటారం, మహదేవ్‌పూర్, కొయ్యూరు పీఎస్‌లకు తరలించారు. కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
* విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి వెళ్లాలంటేనే కరోనా బాధితులు బెంబేలెత్తిపోతున్నారు. కృష్ణా జిల్లాతోపాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. 60 ఏళ్లు పైబడినవాళ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయం అవసరమైన వారినే ఇక్కడికి ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఆసుపత్రిలో 500కు పైగా మంచాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కేసులు ఉద్ధృతంగా నమోదవుతుండటంతో చాలావరకు మంచాలు నిండిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ సహా అన్ని బ్లాక్‌లలోనూ వైద్యమందిస్తున్నారు. నిత్యం భారీ సంఖ్యలో రోగులు వస్తుండగా.. వారిలో అత్యవసర వైద్య సహాయం అవసరమున్నవాళ్లే అధికం. వచ్చే వారందరికీ వెంటనే వైద్యం అందించే పరిస్థితి లేదు. రోగులకు తగ్గట్లుగా వైద్య సిబ్బందీ లేరు. నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే అక్కడ పలువురు వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడటంతో వార్డుల్లోకి వెళ్లేందుకే చాలామంది భయపడుతున్నట్లు సమాచారం. బంధువులకు రోగుల ఆరోగ్య సమాచారం ఇచ్చేవారే లేరు. ఆసుపత్రిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేసినా.. అక్కడ ఉదయం 11 నుంచి రెండింటి వరకే సమాచారమిస్తున్నారు. దీంతో రోగుల బంధువులకు, సిబ్బందికి వాగ్వాదాలు జరుగుతున్నాయి.
* నగరంలోని ప్రైవేటు ఆస్పత్రి నుంచి పసి పిల్లల అక్రమ రవాణా జరుగుతోందని పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఆస్పత్రిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ వివరాలను కమిషనర్ మీడియాకు వెల్లడిస్తూ ‘‘గత నెల 24న సుందరమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ప్రసవించాక బిడ్డను కలకత్తాలో ఉన్నవారికి అమ్మేశారు. ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా ఈ వ్యవహారం జరిగింది. ఈ కేసులో 8 మందిని నిందితులుగా చేర్చాం. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం. ఆస్పత్రి ఎండీ నమ్రత ప్రధాన నిందితురాలు. పసిపిల్లల అక్రమ రవాణాలో ఇద్దరు ఆశా వర్కర్ల ప్రమేయం కూడా ఉంది. పేదలను లక్ష్యంగా చేసుకొని పిల్లల అక్రమ రవాణా సాగుతోంది. ఇదే తరహా కేసులో ఆస్పత్రిపై మరో కేసు నమోదైంది. కేసు విచారణలో ఉంది’’అని కమిషనర్ తెలిపారు.
* రాష్ట్రంలో అసెంబ్లీని సమావేశపరిచి తన బలాన్ని ప్రదర్శించుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన నోట్‌లో సరైన తేదీ, కారణాలు లేవంటూ గవర్నర్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా బలనిరూపణ వంటి కారణాలు పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటుచేయాలనే కారణాలతో గవర్నర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎలాగైనా అసెంబ్లీని సమావేశపరచాలనే వ్యూహాన్ని ముఖ్యమంత్రి గహ్లోత్ రచిస్తున్నట్లు సమాచారం.
* ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తకు పోటీగా సాగుతున్నాయని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. తెదేపా హయాంలో ప్రాజెక్టుల్లో 90 శాతం పనులు పూర్తయినప్పటికీ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. అధికార పార్టీనాయకులకు సొంత కంపెనీలపై ఉన్న శ్రద్ధ రైతుల పొలాలకు నీరందించడంపై లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ పనులు మొదలైనా కాల్వల మరమ్మతు పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. పోలవరాన్ని రివర్స్ టెండర్స్ పేరుతో రిజర్వు టెండర్ వేశారని దుయ్యబట్టారు.
* మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిశోర్ మరణానికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా నేత చినరాజప్ప డిమాండ్ చేశారు. ‘ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మద్యం దుకాణాల సమయం పెంచడమా?’ అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని చినరాజప్ప మండిపడ్డారు. క్వారంటైన్ కేంద్రాలకు వచ్చే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాలని కోరారు.
* హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్ ఛాయ్ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్‌కు మూడో సారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.
* ఆంధప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు ఏపీ హైకోర్టు సాధన సమితి ఐకాస మెయిల్ ద్వారా లేఖ రాసింది. గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు పార్టీలన్నీ ఆమోదించాయని లేఖలో పేర్కొంది. రాజధాని నిర్మాణం అనంతరం పరిణామాలను వివరంగా లేఖలో తెలిపింది. సెలెక్ట్ కమిటీ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నా అసెంబ్లీలో ఆమోదించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఐకాస కోరింది.
* కరోనా మహమ్మారి కర్ణాటక రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇక ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరులో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఆందోళన కలిగించే ఇంకో విషయం ఏంటంటే.. ఈ మహానగరంలో కరోనా సోకిన 3వేల మంది జాడ తెలియకపోవడం. ఇప్పుడు ఇదే విషయంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బెంగళూరు మహానగరంలో గత రెండు వారాల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 14 రోజుల్లో 16 వేల నుంచి కేసుల సంఖ్య 27 వేలకు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి.
* చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని వ్యవస్థపాకుడు జాక్ మాకు గురుగ్రామ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో గతంలో పనిచేసిన పుష్పేంద్ర సింగ్ పర్మార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఆ కంపెనీ సెన్సార్ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2000 నోట్లు రద్దు, భారత్- పాక్ మధ్య యుద్ధం అంటూ తప్పుడు వార్తలను యూసీ న్యూస్ పబ్లిష్ చేసిందని పేర్కొన్నారు.
* కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 1999 జులై 26న భారత సైన్యం కార్గిల్‌లో శతృ దేశం పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అది జరిగి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఏటా ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత సైన్య ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
* పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పలువురు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు స్వీకరిస్తున్నారు. కేవలం వారు స్వీకరించడమే కాదు, ఇతరులూ మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో లక్ష మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి అగ్ర కథానాయకుడు చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
* ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస ‘ది అనలటికల్ సపోర్ట్ అండ్ సాంక్షన్స్ మానిటరింగ్’ టీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు అల్‌ఖైదాలో చేరి ఉండొచ్చని పేర్కొంది. వీరు ఉపఖండంలో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించింది.
* రాష్ట్రంలో అసెంబ్లీని సమావేశపరిచి తన బలాన్ని ప్రదర్శించుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన నోట్‌లో సరైన తేదీ, కారణాలు లేవంటూ గవర్నర్ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా బలనిరూపణ వంటి కారణాలు పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటుచేయాలనే కారణాలతో గవర్నర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
* 1999లో పాకిస్థాన్‌పై సాధించిన కార్గిల్ యుద్ధ విజయాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా క్రికెటర్లు భారత అమరవీరులకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమాల్లో త్రివిధ దళాల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో మన భారత రక్షణ దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎంతో స్ఫూర్తిదాయకం. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మనమెప్పుడూ రుణపడి ఉంటామని సచిన్ చెప్పారు.
* ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లాక్‌డౌన్ వేళ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఈ నటుడు.. ఈ సారి ఓ రైతు తన కుటుంబంతో పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. కుమార్తెలే కాడెద్దులుగా మారిన వీడియోపై ట్విటర్ వేదికగా స్పందించాడు. సదరు రైతుకు ట్రాక్టర్ కొనిస్తానని హామీ ఇచ్చాడు. చిత్తూరు జిల్లా కె.వి.పల్లి మండలం మహల్ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో ఒకటి ఇటీవల బయటకొచ్చింది. కరోనా కష్టకాలంలో ఓ రైతు తన కుటుంబంతో కష్టపడుతున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.