* చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా గ్రూప్, దాని వ్యవస్థపాకుడు జాక్ మాకు గురుగ్రామ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో గతంలో పనిచేసిన పుష్పేంద్ర సింగ్ పర్మార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ఆ కంపెనీ సెన్సార్ చేస్తోందని పేర్కొన్నారు. అలాగే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2000 నోట్లు రద్దు, భారత్-పాక్ మధ్య యుద్ధం అంటూ తప్పుడు వార్తలను యూసీ న్యూస్ పబ్లిష్ చేసిందని పేర్కొన్నారు. ఇండియా-చైనా సరిహద్దుకు సంబంధించిన వార్తలను సెన్సార్ చేసిందని ఫిర్యాదులో తెలిపారు.
* ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారత్‌లో వాహన బీమా రంగంలోకి అడుగుపెడుతోంది. వాహన బీమా పాలసీలు అందించేందుకు ఆకో జనరల్ ఇన్సూరెన్స్‌తో అమెజాన్ పే జట్టు కట్టింది. అమెజాన్ పే.. అమెజాన్ ఇండియాకు చెల్లింపుల విభాగం. వినియోగదారులు బీమా పథకాలను సులభంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్ పే సహకారం అందించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు రాయితీలు లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెజాన్ పే పేజ్, అమెజాన్ యాప్ లేదా మొబైల్ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు వాహన బీమా తీసుకోవచ్చు. పేరు, చిరునామా లాంటి ప్రాథమిక వివరాలు అందించడం ద్వారా కారు లేదా బైకుకు ఎంత బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది లాంటి వివరాలను వాళ్లు తెలుసుకోవచ్చు. బీమా కొనుగోలే కాదు క్లెయిమ్‌లను కూడా కాగితం రహిత రూపేణా సమర్పించవచ్చు. గంటలో పిక్-అప్, మూడు రోజుల్లో క్లెయిమ్‌ల పరిష్కారం, ఎంపిక చేసిన నగరాల్లో ఏడాది పాటు రిపేరింగ్ వారెంటీ లాంటివి మరికొన్ని ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. తక్కువ విలువతో కూడిన క్లెయిమ్‌లకు తక్షణమే నగదు రూపేణా సెటిల్మెంట్ అవకాశాన్ని కూడా పాలసీదార్లు ఎంపిక చేసుకోవచ్చు. బీమా ప్రీమియంను అమెజాన్ పే బ్యాలెన్స్, యూపీఐ లేదా కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ‘అత్యంత నమ్మదగిన, సులభమైన, ప్రయోజనకర రీతిలో అమెజాన్ పే ఉండాలన్నది మా అభిమతం. మరిన్ని సేవలకు డిమాండు పెరుగుతోందనే విషయం అర్థమవుతోంది. అందుకే అందుబాటు ధరలో, సులభంగా పొందేలా వాహన బీమా పథకాన్ని మేం ప్రారంభిస్తున్నామ’ని అమెజాన్ పే ఇండియా డైరెక్టర్, ఆర్థిక సేవల విభాగం హెడ్ వికాశ్ బన్సాల్ అన్నారు.
* కరోనావైరస్ రెండో తరంగం ప్రపంచాన్ని ముంచేందుకు వేగంగా దూసుకొస్తోంది. ఇటీవలే ఆసియాలోనే అతిపెద్ద షిన్‌ఫడి హోల్‌సేల్ మార్కెట్లో కరోనావైరస్ పడగవిప్పడంతో బీజింగ్‌లో ప్రధాన ప్రాంతాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి.. మరోపక్క అమెరికాలో కూడా ‘స్టే ఎట్ హోమ్’ నిబంధనలు ఎత్తేయడంతో భారీ సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన మరిన్ని ఉద్యోగాలకు కోతలు పడే ప్రమాదం ఉంది. భారత్‌లో కూడా లాక్డౌన్ నిబంధనలు సడలించాక కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చెన్నైలో మరోసారి లాక్డౌన్ విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికాలోని వైద్య నిపుణులు కూడా రెండో తరంగం మొదలైందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
* పట్టణాలు, నగరాల్లోని ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, అపార్టుమెంట్ల భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. వచ్చే నెల 1 నుంచే వీటిని పెంచాలని భావిస్తోంది. ఆయా ప్రాంతాల డిమాండ్లను అనుసరించి ఈ భూముల విలువలు కనీసం 5 నుంచి 50 శాతం పైగా పెరిగే అవకాశాలున్నాయి. ధరలను ఎంతవరకు పెంచాలన్న అంశంపై శనివారం రాత్రి వరకు మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని డిమాండ్‌ను అనుసరించి భూముల విలువలను సవరిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోతే.. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదించిన ధరలే అమల్లోకి రావచ్చు.