WorldWonders

ఆవాలకు ఒక మ్యూజియం

ఆవాలకు ఒక మ్యూజియం

వాటికీ మ్యూజియమా అనేయకండి. అమెరికన్లకు కోపం వస్తుంది. వాళ్లకి ఆవపిండితో చేసిన వంటలంటే ఎంతిష్టమో! అందుకే ఓ అమెరికన్‌ వేల రకాల ఆవాలను సేకరించి మ్యూజియం పెట్టేశాడు. సందర్శకులు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచేలా ఏర్పాట్లు చేశాడు. అమెరికాలోని మిడిల్టన్‌లో విస్కాన్సిన్‌, మౌంట్‌ హోరేబ్‌లో ఉందీ ప్రదర్శనశాల. దీని పేరు నేషనల్‌ మస్టర్డ్‌ మ్యూజియం.
*దీని సృష్టికర్త బారీ లెవెన్సన్‌.. ఈయన విస్కాన్సిన్‌ మాజీ అటార్నీ జనరల్‌. 1986 నుంచీ ఆవాల సేకరణ మొదలుపెట్టాడు. ఏప్రిల్‌ 6, 1992లో దీన్ని తెరిచాడు. ఎందుకా! ఏదో కేసు విషయమై వాదనకి వెళ్తూ తన జేబులో చిన్న ఆవాల డబ్బా ఉందన్న విషయం మరిచిపోయాడట. తీరా చూస్తే ఆ కేసులో ఘన విజయం సాధించాడు. ఇక ఆయనకదో సెంటిమెంటు అయిపోయింది. ఎక్కడికెళ్లినా ఆవాలను సేకరించేవాడు. ఆఖరికవి మ్యూజియం పెట్టాల్సినంతగా పెరిగిపోయాయి. అసలే అమెరికన్లు ఆవాల ప్రియులు కదా! సందర్శకుల తాకిడీ పెరిగింది.
**అంత సీనుందా!
మనకి తెలిసి ఆవాలంటే.. చిన్నా, పెద్ద, నలుపూ తెలుపే! కానీ ఇక్కడ.. 60 దేశాల నుంచి తెచ్చిన ఆవాలు 6000 రకాలుంటాయి. వాటిని చూడ్డమొక్కటే కాదు! ఆవాలతో చేసిన వంటకాల్నీ రుచి చూడొచ్ఛు
**స్వీట్‌ హాట్‌ మస్టర్డ్స్‌, ఫ్రూట్‌ మస్టర్డ్స్‌, హాట్‌ పెప్పర్‌ మస్టర్డ్స్‌, హార్స్‌ రాడిష్‌ మస్టర్డ్స్‌, స్పిరిట్‌ మస్టర్డ్స్‌ వంటివి.. మనమెప్పుడూ కనని, వినని రకాలుంటాయి. ఈ సేకరణలో ఇతర దేశాలవే ఎక్కువుండటం విశేషం!
**కొత్తవీ… పాతవీ!
ఇక్కడ పాతకాలపు ఆవాలు, ఆవపిండి కుండలు, దేశాలు, రాష్ట్రాల నుంచి తెచ్చిన వివిధ రకాల ఆవజాడీలు, ఆవాలతో నిండిన గొట్టాలు, సీసాలు, రేకు డబ్బాలు ఉంటాయి. వాటిపై ఏ కాలంవి, ఎక్కణ్నుంచి తెచ్చారు, వాటి పేరు, జాతి అన్నవీ రాసుంటాయి. ఇంకా.. కొత్తగా పండిస్తున్న రకాలెన్నో!
**ఆసక్తి ఉంటే ఓ ఆవడబ్బా
ఆవాల వంటకాలు, వివిధ ఆకృతుల్లోని ఆవ జాడీలను ఇక్కడ కొనుక్కోవచ్ఛు అందుకోసం పై అంతస్తులో ఓ దుకాణముంది. కెప్టెన్‌ ఆవాల బొమ్మలు, రకరకాల వంట పాత్రలూ ఉంటాయి. ఆ మ్యూజియంలో ఆవపిండి మూలికా స్నానం ప్రత్యేకం. ఇంకా.. ఆవాలతో చేసిన సాస్‌, జామ్‌, డిప్పింగ్స్‌ లాంటివి బోలెడు.
**ఆవాలతో చికిత్స
ప్రపంచంలో లెక్క లేనన్ని రోగాలకు ఆవాలతో చికిత్స చేసే విధానాన్ని చూపిస్తారు. దాంతో పాటుగా ఈజిప్షియన్‌ ఫారోల సమాధులలో ఏ రకమైన ఆవపిండిని, ఎలా వేసేదీ వివరిస్తారు.2002లో ఈ ఆవాల మ్యూజియం గురించి ఫుడ్‌ నెట్‌వర్క్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘అన్‌రాప్డ్‌’ లో వచ్చింది.ఆవగింజల్ని లెక్కేయడం ఎంత కష్టం? అలానే.. ఆగస్టు మొదటి శనివారం జరిగే ఆవాల దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్యా అంతలా ఉంటుందట!!