మాటల కంటే మౌనం గొప్పదని నిరూపించిన మహానుభావులు ఎందరో! మౌనంగా ఉంటే వ్యవహారం ఎలా సాగుతుందని ప్రశ్నించేవారూ ఉన్నారు.
ఎక్కడ ఏ సమయానికి ఏది మాట్లాడాలో తెలిసినవారే చతురులు, చమత్కారులు. సమయస్ఫూర్తి కలిగినవారు.
కొందరు మాటలను తూటాల్లా పేలుస్తారు. కొందరు నర్మగర్భంగా మాట్లాడతారు. కొందరు పుల్ల విరిచినట్లు మాట్లాడి నెత్తిమీదకు తెచ్చుకుంటారు.
భగవంతుడు మనకు స్వరపేటికను ఇచ్చింది మాట్లాడటానికే. చక్కగా మాట్లాడుతుంటే కొందరికి హాయిగా ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా ఉండాలంటే కాళ్లు, చేతులు కట్టేసినట్లుంటుంది.
మరి కొందరు వాగుడుకాయలు. లొడలొడ వాగుతారు. ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియనట్లు మాట్లాడతారు. పిచ్చివాడి ప్రేలాపనలా ఉంటుంది వాళ్ల మాటతీరు.
మాటల్ని జాగ్రత్తగా వాడాలి. పొదుపుగా ఉపయోగించాలి. అంగడి నుంచి కొనుక్కుని తెచ్చుకున్నట్లు మాట్లాడాలి. అవసరమైతే బంగా రంలా మాట్లాడాలి.
మాట ఔషధంలా పని చేస్తుంది. మాట మంత్రంలా ప్రభావం చూపుతుంది. మాట రాయబారిగా పని చేస్తుంది. ఒక్కోసారి మాట పెద్దపెద్ద కార్యాలు చక్కబెడుతుంది.
మాటలు విడిచిపెట్టిన బాణాల్లాంటివి. మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి వదిలిపెట్టిన తరవాత లక్ష్యాన్ని ఛేదించక మానవు. మనసులను గాయపరచక వదలవు.
చిన్నపిల్లలైనా, పెద్దవారైనా కొన్ని మాటలకు నొచ్చుకుంటారు. కొన్నిసార్లు మాటలకు మెచ్చు కుంటారు. నొప్పించే మాటలతో మళ్లీ ముఖం చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది.
మాట వెనక నేను ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంటామో వాళ్లకీ నేను ఉంటుంది. మాట సూటిగా వెళ్లి ‘నేను’ను కదుపుతుంది. అది అహాన్ని దెబ్బతీస్తుంది. మంచికైనా చెడుకైనా మాటే ఆయుధం.
శ్రీకృష్ణుడు చక్కగా, దివ్యంగా సంభాషించేవాడు. శ్రీరాముడు ప్రశాంతంగా, నిర్మలంగా సంభాషించేవాడు. హనుమంతుడు మధురంగా ప్రేమపూర్వకంగా మాట్లాడేవాడు. విదురుడి మాటలు నీతులుగా మారిపోయేవి. జ్ఞానుల మాటలన్నీ బోధలే!
మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకు? మనకు జ్ఞానం ఉంది కదా మాట్లాడగలం అనుకుంటారు. ఆ జ్ఞానం వెనకే అహం ఉంటుంది. పాండిత్యం ఉంది కదా, చాకచక్యంగా మాట్లాడగలం అనుకుంటారు. దాని వెనకే కనపడని నేను కాచుకుని ఉంటుంది.
విద్యా వినయంతో, వంగిపోయిన చెట్టులాగ ఉండి ఫలపుష్పభరితమై అందరినీ చక్కటి ప్రేమ పూర్వకమైన సంభాషణతో అలరించాలి. మాటలు వింటుంటే గంధం పూసినట్లుండాలి. తేనె చప్పరించినట్లుండాలి. హృదయం పరవశంతో ఊగిపోవాలి.
శక్తిమంతమైన మాటలే హృదయ వైశాల్యాన్ని పెంచుతాయి. కాకులు అరుస్తూనే ఉంటాయి. కోయిలలు వసంతంలోనే పాడుతాయి. మహాగాయకుడు మంచి వేదికపైనే గళం విప్పుతాడు.
మాట మీద ఎరుక ఉంచాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినే మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలి. మంచికోసమే మాట్లాడాలి. అలా మాట్లాడితే ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత వద్దన్నా లభిస్తాయి.