జీవితానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు అయిదు అని శాస్త్ర వచనం. అవి- ఉపాశ్యం (ఉపాసించదగింది), ఉపాదేయం(గ్రహించదగింది), ఉపాదానం (విషయ వాంఛల వల్ల కలిగే కష్టాలనుంచి ఇంద్రియాలను మరల్చే మార్గం), ఉపాధి (ధర్మచింతన), ఉపాగతం(ఫలితం). ఇవి కలిగి ఉన్నవారు ఇహంలో సుఖసంతోషాలను, పరంలో పరమాత్మ ఐక్యాన్ని పొందగలుగుతారని భాగవతులు చెప్పిన మాట. వాటన్నింటినీ ప్రసాదించేది- భాగవతం.
ఇందులో ఏ ఘట్టం, శ్లోకం, పద్యం చదివినా పైన తెలిపిన విషయాల్లో ఏదో ఒకదాని ప్రస్తావన ఉంటుంది. ఒకదానికి అనుసంధానంగా మరొకటి ఉంటూ చివరకు మోక్ష పథాన నడిపించడం ఈ కావ్యవిశేషం. ‘భగవానుని అనేక మార్గాల్లో ఉపాసించి మోక్షం పొందవచ్ఛు కోపం, స్నేహం, ప్రేమ, ద్వేషం, భయం, కోరిక, బాంధవ్యం లాంటి వాటిలో వేటి చేతనైనా భగవన్నామాన్ని స్మరిస్తే… భ్రమరం కీటకాన్ని తెచ్చి గూటిలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఝంకారం చేస్తే, ఆ గూటిలోని కీటకం సైతం భ్రమరంగా మారినట్టు, పై మార్గానుయాయులు సైతం భక్తులుగా మారి, చివరకు ఆయన చేతిలో ముక్తులవుతారు’ అని ఉపాస్యం గురించి సప్తమ స్కంధ ప్రారంభంలో స్పష్టంగా వివరించారు భాగవతకారులు.
భయంతో కంసుడు, ద్వేషంతో హిరణ్యకశిపుడు, అసూయతో శిశుపాలుడు, సాహసోపేతమైన ప్రేమతో రుక్మిణి, ఆరాధనతో రాధ, జ్ఞానంతో భీష్ముడు, ఎరుకతో ధర్మరాజు, అనుభూతితో గోపికలు ఉపాసన (నిరంతర స్మరణ) చేసి భగవానుడి అనుగ్రహానికి పాత్రులై చివరకు ఆయన్ను చేరుకోగలిగారని ఆఖ్యానాల రూపంలో ఉపాదేయాన్ని విశదీకరించింది భాగవతం.
మానవులందరికీ చతుర్విధ పురుషార్థాల్లో మొదటి మూడూ అయిన ధర్మ, అర్థ, కామాలు పూర్వ జన్మల్లో చేసిన కర్మల ఫలితంగా కలుగుతాయంటారు. ఈ శరీరం ఇంతకుముందు అనేక జన్మలు ఎత్తినందువల్ల ఆయా జన్మల వాసనా ఫలితంగానే అవి సంక్రమిస్తాయని చెబుతారు. వాటి ప్రోద్బలంతో లోకులు అల్పమైన సుఖాల కోసం తాపత్రయపడుతూ దాని ఫలితంగా అధికమైన దుఃఖాన్ని పొందుతారు. జ్ఞానం సంకుచితం కావడమే దానికి కారణం. దాన్నుంచి మరల్చే మార్గం భగవద్ధ్యానమే. అదే ముక్తికి మూలకారణంగా నిలుస్తుందన్నది ఉపాదానానికి వివరణ.
‘అన్ని రూపాలూ తన రూపమే అయినవాడు, ఆది, మధ్య, అంతం లేనివాడు, భక్తజనులను పాలించేవాడు భగవానుడు’ అని చెబుతుంది భాగవతం. ‘యోగులకు యోగీశ్వరుడిగా, జ్ఞానులకు మునిగా, ప్రజాపతి రూపంలో పాలకులకు, భగవంతుడి రూపంలో సామాన్యులకు గోచరమవుతూ అనేక రూపాల్లో లోకంలో చైతన్యాన్ని కలిగించేవాడు పరమాత్మ ఒక్కడే’ అని అష్టమస్కంధంలో మోహినీ అవతార ఘట్టంలో ఉపాధిని సరళంగా విశదీకరించింది భాగవతం.
ఆ స్థితికి చేరి మనసును ఇహలోక బంధనాల నుంచి మరల్చుకుంటే, స్వస్థత చేకూరి లోకతత్వం, లోకేశ్వర తత్వం తెలిసి, ఆపైన లోకాతీతుడైన పరమాత్మ గురించి స్పష్టంగా గోచరమవుతుందని వివరించి ఇంద్రియాలను విషయ వాంఛల నుంచి భగవంతుడి వైపు మరల్చే ప్రయత్నం చేయాలని భాగవతం ఉద్బోధిస్తుంది.
‘నీలో లేని లీలలు లోకంలో మరెక్కడా లేవు. నేలలో, నీటిలో, నింగిలో ఎటు చూసినా నీ లీలలే. కర్రలో అగ్ని ఉన్నా అది కర్రను కాల్చదు. అదే కర్రను అగ్నిలో పెడితే ఆ అగ్ని కర్రను కాల్చుతుంది. అలాగే భగవంతుడి లీలలు తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. నీలో భగవత్తత్వం ఆవహించాలి. అప్పుడు భగవంతుడే నువ్వు, నువ్వే భగవంతుడివి’ అని దశమ స్కంధంలో చెప్పి ఉపాగత (భగవంతుణ్ని పొందే) మార్గాన్ని సూచించారు భాగవత కర్తలు.