Agriculture

అమెరికన్లను విత్తనాలతో భయపెడుతున్న చైనా

అమెరికన్లను విత్తనాలతో భయపెడుతున్న చైనా

అగ్ర‌రాజ్యం అమెరికాను మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కంటిమీద క‌నుకు లేకుండా చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా నుంచి వ‌చ్చిన మిస్ట‌రీ విత్త‌నాల‌తో కూడిన‌ పార్శిళ్లు అమెరిక‌న్ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. యూఎస్‌లోని సుమారు 27 రాష్ట్రాల వాసుల్ని ఈ విత్త‌నాల పార్శిళ్లు వణికిస్తున్నాయి. వర్జీనియా, వాషింగ్టన్, అరిజోనా, ఇండియానా, లూసియానా, టెక్సాస్‌ల‌తో పాటు ఇత‌ర‌ రాష్ట్రాలకు చెందిన కొంతమంది చిరునామాలకు మిస్టరీ విత్తనాల పార్శిళ్లు రావ‌డం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న‌ వేళ ఎవ‌రూ ఎలాంటి ఆర్డ‌ర్లు ఇవ్వ‌కున్న‌ కొరియర్‌లో వచ్చిన ఈ విత్తనాలపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ విత్తనాలు వింతగా ఉండ‌డంతో పాటు ఆ కవర్లమీద చైనా భాష ఉంది. ఈ విత్తనాలు ఎక్కడా భూమిలో నాటవద్దని, ఇవి హానికారక విత్తనాలు కావొచ్చ‌ని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు 27 రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఈ విష‌య‌మై హెచ్చ‌రించారు. ఈ విత్తనాలు నాటితే పర్యావరణం పాడవ‌డంతో పాటు ఇతర పంటలను కూడా ఇవి నాశ‌నం చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని వారించారు. ఈ విత్తనాల గుట్టుర‌ట్టు చేసే ప‌నిలో అమెరికా అధికారులు, శాస్త్ర‌వేత్త‌లు ఉన్నారు. అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ విత్తనాలు అమెరికన్లకు పంపారో తేల్చే ప‌నిలో ఉన్నారు. క‌నుక కొరియర్‌లో ఇలాంటి విత్తనాల పార్శిళ్లు వ‌చ్చిన వారు వీటితో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు ప్ర‌జ‌ల‌ను కోరారు. పార్శిల్ అందుకున్న‌వారు వెంట‌నే త‌మ‌కు స‌మాచారం అందించాల‌ని తెలిపారు. ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో డ్రాగ‌న్ దేశంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అగ్ర‌రాజ్యం… ఈ విత్త‌నాల విష‌యాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి.