* భారత్‌లో కరోనా కట్టడి చర్యలకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) చేయూతనిస్తోంది. మూడు మిలియన్ డాలర్ల గ్రాంటు మంజూరుకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆసియా పసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఏపీడీఆర్‌ఎఫ్) కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చనుంది. వైరస్ బాధితుల్ని వేగంగా గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందజేయడం వంటి చర్యలకు ఈ నిధుల్ని ఉపయోగించాలని నిర్దేశించింది. అలాగే, పరీక్షల రేటు పెంచడం, లక్షణాలున్న వారిని వీలైనంత వేగంగా గుర్తించడం వంటి పనులకు ఈ నిధుల్ని వెచ్చించాలని సూచించింది. గత ఏప్రిల్‌లోనూ కొవిడ్ కట్టడి నిమిత్తం 1.5 బిలియన్ డాలర్లును విడుదల చేసింది. ఏడీబీ సభ్య దేశాల్లో కరోనా వైరస్ నివారణ, కట్టడి కోసం ఏప్రిల్ 13న 20 బిలియన్ డాలర్లతో ‘కొవిడ్-19 పాండెమిక్ రెస్పాన్స్ ఆప్షన్’(సీపీఆర్‌వో) పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
* భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు.. నేడు నేల చూపులు చూడటం గమనార్హం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, దేశీయంగా కంపెనీల ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. దీంతో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి. ఇంధన, ఐటీ రంగాల్లో ఎక్కువ అమ్మకాలు జరిగాయి.
* ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందిచడంలో భాగంగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి 29 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా వైట్ ఓప్స్ సటోరి అనే ఇంటెలిజెన్స్ గ్రూప్ ఈ యాప్‌లలో యాడ్‌వేర్ అనే వైరస్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించిన ఈ 29 యాప్‌లతో చార్టర్ యూజ్‌బ్లర్ అనే కోడ్ పేరుతో ఈ యాడ్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ఫోన్‌లలో ప్రవేశింపజేస్తున్నారని పేర్కొన్నారు. ఆడ్రాంయిడ్ యూజర్లు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత లాంచ్ ఐకాన్ ఫోన్‌లో కనిపించకుండా పోతుందని, దీంతో ఈ యాప్‌లను తొలగించడం కష్టంమవుతుందని తెలిపారు.
* ఇంటర్నెట్ కంపెనీలు యావత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఊహించని పరిణామాన్ని ఎదుర్కోబోతున్నాయి. తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధినేతలు అమెరికా చట్టసభల ముందు హాజరు కానున్నారు. ఈ సందర్భంలో ఆయా సంస్థలు ఎదిగిన తీరు, వాటి విజయగాథలను విచారణ కమిటీ ముందు వివరించనున్నారు.
* కరోనా వైరస్ విలయం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే 16 మిలియన్ల మందికి పైగా సోకిన ఈ వైరస్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు సైతం వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితుల్లో ప్రముఖ దిగ్గజ సెర్చింజన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన ఈ టెక్ దిగ్గజం.. తాజాగా ఆ గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించింది.
* తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలే కరోనావైరస్ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారికి ఇది మరింత భారంగా మారింది. ఇప్పుడు చాపకింద నీరులా ఇంధన ధరలు పెరగడం రవాణా రంగం సహా ఇతర రంగాలపై ప్రభావం చూపించనుంది. అసలు ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గితే ఆ ప్రభావం ఎందుకు కనిపించడంలేదు.. భారత్‌లో చమురు ధరలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించారు. అంటే అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా ఆ ప్రభావంతో ధరలు పతనం అవ్వాలి. కానీ, అలా జరగడంలేదు. గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. కానీ, మన మార్కెట్లలో ఆ స్థాయి తగ్గింపు కనిపించలేదు. పైగా గత తొమ్మిది రోజుల నుంచి మాత్రం క్రమం తప్పకుండా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 82 రోజుల విరామం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పైగా బ్రెంట్ క్రూడ్ ధరలు జూన్ 1 తర్వాత నుంచి మళ్లీ తగ్గుతున్నాయి. భారత్‌లో చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ వదులుకోవడం అనేది వాస్తవ పరిస్థితుల్లో కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారుడితో పంచుకొంటారు. అదే ధరలు పతనమైన సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం పన్నులను పెంచుతుంది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. చివరికి ఉన్న ధరలను కొనసాగించడమే వినియోగదారుడికి పెద్ద ఊరడింపు అన్న పరిస్థితి కలుగుతుంది. గత ఫిబ్రవరి నుంచి ఇదే జరిగింది. ఇంధన ధరలపై నియంత్రణను వదులుకున్నాక కూడా అంతిమంగా అత్యధిక లాభం ప్రభుత్వాలకే వెళ్తోంది. కొంత ఇంధన కంపెనీలకు చేరుతోంది.