* కొవిడ్-19 వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్‌కు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. రెమిడెవిసిర్కు జనరిక్ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనా వైరస్ వ్యాధి ప్రాధమిక, మధ్యస్థ దశలో ఉన్నపుడు వాడతారు. తాజా ఔషధం ఫావివిర్ నోటి ద్వారా తీసుకునే మాత్రల రూపంలో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు, ఫార్మసీల్లో లభ్యమవుతుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దీనిని వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకు మాత్రమే అందచేస్తామని.. ఒక మాత్ర విలువ రూ.59గా సంస్థ నిర్ణయించింది.
* ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్ బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు… ఊఆఏలో ల్యాండ్ అవ్వడంతో… ఇరాన్ అలర్ట్ అయ్యింది. ఎందుకైనా మంచిదని మూడు క్షిపణుల్ని మోహరించింది.రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కి వస్తున్నాయంటే చాలు… చాలా దేశాలకు వెన్నులో వణుకు పుడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారమే… 5 రాఫెల్ యుద్ధ విమానాలు… ఫ్రాన్స్‌లోని ఇస్ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి సోమవారం టేకాఫ్ అయ్యాయి. అవి ఊఆఏలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్ దగ్గర ల్యాండ్ అయ్యాయి. ఆ తర్వాత బుధవారం ఇండియాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అవ్వాలన్నది షెడ్యూల్. ఇది మొత్తం 7364 కిలోమీటర్ల ప్రయాణం. ఐతే… జులై 28న అల్ ధఫ్రాలో రాఫెల్ విమానాలు ల్యాండ్ అవ్వగానే… ఊఆఏ పక్కనే ఉండే ఇరాన్ టెన్షన్ పడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్… మిలిటరీ ఎక్సర్సైజ్ తర్వాత… మూడు మిస్సైళ్లను (క్షిపణులను), అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌కి దగ్గర్లో మోహరించారు. అల్ ధఫ్రా అనేది… ఊఆఏ రాజధాని నగరం అబు దాబీకి గంట ప్రయాణ దూరంలో ఉంటుందిఇరాన్ ఎప్పుడైతే మిస్సైళ్లను మోహరించిందో… అల్ ధఫ్రాతోపాటూ… ఖతార్‌లోని ఆఈ యుడీడ్ ఎయిర్‌బేస్‌కి అలర్ట్ మెసేజ్‌లు వెళ్లాయి. అటు వైపుగా ఇరాన్ క్షిపణులు వచ్చే అవకాశం ఉందన్నది ఆ అప్రమత్త సందేశం. ఐతే… ఇరాన్ ఏ మిస్సైళ్లనూ పంపలేదు. ఆ రెండు ఎయిర్‌బేస్‌లలో అమెరికా దళాలు ఉన్నాయి. అవి పూర్తిగా అలర్ట్ అయ్యాయి. ఇరాన్ తన సముద్ర జలాల్లో మిస్సైళ్లను మోహరించిందని తెలుసుకున్నాయి. ఐతే… ఇరాన్ వర్గాలు మాత్రం తమ మిలిటరీ ఎక్సర్సైజ్లో అది భాగమంటున్నాయి.మంగళవారం ఇరాన్ సైన్యానికి చెందిన ఓ స్పీడ్ బోట్ నుంచి ఓ క్షిపణి దూసుకెళ్లింది. అది కూడా మిలిటరీ ఎక్సర్‌సైజులో భాగమే అని ఇరాన్ తెలిపింది.రాఫెల్ యుద్ధ విమానాలతో తమపై దాడి చేస్తారేమో అనే భయంతోనే ఇరాన్… క్షిపణుల్ని రెడీ చేసుకొని ఉంటుందనే అనుమాలు కలుగుతున్నాయి. ఆ విమానాలు ఇండియా వెళ్తాయని తెలిసినా… ఎందుకైనా మంచిదని ఇరాన్ అప్రమత్తమై ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇదివరకు ఇరాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు ఉండేవి. అమెరికా ఒత్తిడి కారణంగా… భారత్… ఇరాన్‌కి దూరమైంది. అప్పటి నుంచి ఇరాన్… చైనా వైపు మాట్లాడుతూ… భారత్‌ను తనకు శత్రుదేశం అన్నట్లుగా చూస్తోంది. భారత్ మాత్రం ఇరాన్ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తోంది.
* ప్రతిష్ఠాత్మకమైన రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా దిగాయి. అబుదాబి అల్ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఐదు రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చాయి. 17వ వైమానిక స్క్వాడ్రన్‌లో రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది.
* కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో నూతన విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. అలాగే మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఇస్రో మాజీ చీఫ్ కె.కస్తూరీరంగన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
* రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు గవర్నర్ కార్యాలయం నుంచి మళ్లీ చుక్కెదురైంది. జులై 31న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడోసారి అందిన ప్రతిపాదనలను గవర్నర్ కల్రాజ్ మిశ్రా మళ్లీ తిరస్కరించారు. దీంతో గవర్నర్‌ను మరోసారి కలవడానికి ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సిద్ధమయ్యారు. తిరస్కరణకు గల కారణాలను నేరుగా గవర్నర్‌నే అడిగి తెలుసుకుంటానని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
* కరోనా రోగులకు సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం కొవిడ్‌పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో కొవిడ్ రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున వెచ్చిస్తున్నట్టు చెప్పారు. కరోనా మృతుల లెక్కలు దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
* ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అయోధ్య, దిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు.
* భారత్‌లో కరోనా కట్టడి చర్యలకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) చేయూతనిస్తోంది. మూడు మిలియన్ డాలర్ల గ్రాంటు మంజూరుకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఆసియా పసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఏపీడీఆర్ఎఫ్) కింద భారత్‌కు ఈ నిధులను సమకూర్చనుంది. వైరస్ బాధితుల్ని వేగంగా గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందజేయడం వంటి చర్యలకు ఈ నిధుల్ని ఉపయోగించాలని నిర్దేశించింది.
* అత్యంత అధునాతన రఫేల్ యుద్ధవిమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి 5 రఫేల్ ఫైటర్ జెట్లు భారత్‌కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు సురక్షితంగా చేరాయని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ జెట్ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు.
* ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందిచడంలో భాగంగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి 29 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా వైట్ ఓప్స్ సటోరి అనే ఇంటెలిజెన్స్ గ్రూప్ ఈ యాప్‌లలో యాడ్వేర్ అనే వైరస్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఫొటో ఎడిటింగ్‌కు సంబంధించిన ఈ 29 యాప్‌లతో చార్టర్ యూజ్‌బ్లర్ అనే కోడ్ పేరుతో ఈ యాడ్‌వేర్‌ను యాప్‌ల ద్వారా ఫోన్లలో ప్రవేశింపజేస్తున్నారని పేర్కొన్నారు.
* కరోనా వైరస్ బారినపడిన వారు భయాన్ని వీడాలని, ఆ భయం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని కథానాయకుడు విశాల్ సూచించారు. తాను, తన తండ్రి, మేనేజర్ కరోనా బారినపడి 3 వారాల్లోనే కోలుకున్నామని స్పష్టం చేశారు. ఇందుకు ఆయుర్వేద, హోమియో మందులు బాగా పనిచేశాయని పేర్కొన్నారు. తాను ఏ మెడిసిన్‌ను ప్రచారం చేయడం లేదని, ఎలా కోలుకున్నామో చెప్పడానికి ఆయుర్వేద, హోమియో మందుల పేర్లను సామాజిక మాధ్యమాల్లో చెప్పానని వెల్లడించారు.
* తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ముందు జాగ్రత్తలో భాగంగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు స్పష్టంచేశారు.