Business

86 శాతం పడిపోయిన హైదరాబాద్ రియల్ దందా

86 శాతం పడిపోయిన హైదరాబాద్ రియల్ దందా

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) ప్రజారోగ్యం, ప్రజల ఉపాధి అవకాశాల మీదే కాకుండా ఇళ్ల అమ్మకాలను సైతం కుంగదీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్‌ టైగర్‌’ విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో నివాస గృహాల అమ్మకాలు క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 79 శాతం క్షీణించి 18,038 ఇళ్లకు పరిమితమైనట్లు ఈ సంస్థ పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులు దీనికి కారణమని వివరించింది.
*అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ఎన్‌సీఆర్‌ దిల్లీ, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, ముంబయి, పుణె నగరాల్లో నివాస గృహాల అమ్మకాల తీరుతెన్నులను పరిశీలించినట్లు వివరించింది.
* హైదరాబాద్‌లో గతేడాది జూన్‌ త్రైమాసికంలో 8,122 ఇళ్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి 86 శాతం తగ్గి 1,099కు పరిమితమయ్యాయి. ముంబయిలో 85 శాతం, అహ్మదాబాద్‌లో 83 శాతం, ఎన్‌సీఆర్‌ దిల్లీలో 81 శాతం క్షీణత కనిపిస్తున్నట్లు పేర్కొంది. బెంగళూరులో ఇళ్ల అమ్మకాల్లో క్షీణత 73 శాతం మాత్రమే.
* ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 62 శాతం తగ్గి 6,653 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
*ఇళ్లకు గిరాకీ తగ్గటానికి ఆర్థిక అనిశ్చితి, నిరుద్యోగం తావిస్తున్నట్లు ప్రాప్‌ టైగర్‌ పరిశోధనా విభాగం అధిపతి అంకిత సూద్‌ పేర్కొన్నారు. మకాన్‌, హౌసింగ్‌.కామ్‌ వెబ్‌సైట్లకు కూడా ఆమె పనిచేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇళ్ల అమ్మకాలు కోలుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.