NRI-NRT

టైమ్స్ స్క్వేర్‌లో రామయ్య

టైమ్స్ స్క్వేర్‌లో రామయ్య

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల దశాబ్దాల కల ఆగస్ట్ 5వ తేదీన నిజం కాబోతోంది. అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే సమయంలో భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లోనూ ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వేడుకలా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 5వ తేదీన రాముడి ఫొటోలు, నూతనంగా నిర్మించబోయే ఆలయానికి సంబంధించిన ఫొటోలు న్యూయార్క్ నగరంలో మెరవనున్నాయి. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న భారీ బిల్‌బోర్డ్స్‌లో ఆగస్ట్ 5వ తేదీన రాముడికి సంబంధించిన ఫొటోలు డిస్ప్లే కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయని అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహ్వీనీ బుధవారం తెలిపారు. స్టాక్‌మార్కెట్లకు సంబంధించిన నాస్‌డాక్ స్క్రీన్‌తో పాటు టైమ్స్ స్వ్కేర్‌లోని భారీ స్క్రీన్‌లను లీజ్‌కు తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఆగస్టు 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ స్క్రీన్లపై హిందీ, ఇంగ్లీషు భాషల్లో ‘జై శ్రీరామ్’ అన్న పదాలు, రాముడి ఫొటోలు, వీడియోలు, రామ మందిరానికి సంబంధించిన 3డీ డిజైన్లు, మోదీ శంకుస్థాపన ఫొటోలు డిస్ప్లే కానున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో భారతీయులంతా టైమ్స్ స్క్వేర్ వద్ద సమావేశమై వేడుక జరుపుకోనున్నట్టు సెహ్వానీ చెప్పారు. ప్రధాని మోదీ ఆధ్యర్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల కల నిజమవుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అయ్యేంత వరకు ఈ కల నిజమవుతుందని తాము ఊహించలేదన్నారు. ఇది జీవితంలో లేదా శతాబ్దానికి ఒకసారి వచ్చే వేడుక కాదని.. మొత్తం మానవజాతికి సంబంధించి ఇటువంటి వేడుక ఒక్కసారి మాత్రమే వస్తుందని సెహ్వానీ అన్నారు.