ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కి తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని కోరుతూ మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐకి ఈమెయిల్ పంపించారని తెలిసింది. టీవీ వ్యాఖ్యాతల నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటానని తనకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారని సమాచారం.
క్రికెట్ పరిజ్ఞానం బాగా ఉండి చక్కని ఆంగ్లంలో సంజయ్ మంజ్రేకర్ కామెంటరీ చేయగలరు. అయితే కొన్ని అంశాలు వివరించేటప్పుడు వివాదాస్పద పదాలు జోడించడం కొందరు ఆటగాళ్లు, సహ వ్యాఖ్యాతలను ఇబ్బంది పెట్టింది. ‘బిట్స్ అండ్ పీసెస్’ అంటూ చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకున్న టీమ్‌ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. డే/నైట్ మ్యాచ్ సందర్భంగా హర్షభోగ్లేనూ అవమానిస్తూ మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో ఆయనపై బీసీసీఐ వేటు వేసింది.
‘గౌరవనీయులైన బీసీసీఐ సర్వోన్నత మండలి సభ్యులు కుశలమేనని భావిస్తున్నాను. వ్యాఖ్యాతగా నా స్థానం గురించి పంపించిన ఈమెయిల్‌ను మీరు ఇప్పటికే అందుకొని ఉంటారు. ఐపీఎల్ తేదీలు ప్రకటించడంతో బోర్డు త్వరలోనే వ్యాఖ్యాతల బృందాన్ని ఎంచుకోనుంది. మీరు పేర్కొన్న నిబంధనావళిని పాటిస్తూ పనిచేయడం నాకు సంతోషమే. నా వినతిని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదాలు’ అని మంజ్రేకర్ ఈమెయిల్ రాశారని తెలిసింది.
‘సంజయ్ మంజ్రేకర్‌ను క్షమించేసి ఇక్కడితో ఈ అధ్యాయాన్ని ముగించాలని అనుకుంటున్నాం. జడేజాపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే క్షమాపణలు కోరాడు. ఆ ఆటగాడినీ కలిశాడు. టీవీ వ్యాఖ్యాతల నిబంధనావళికి అనుగుణంగా పనిచేస్తానని మాటిచ్చాడు. అతడికి క్రికెట్‌పై అపారమైన పరిజ్ఞానం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే’ అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. ఏదేమైనప్పటికీ తుది నిర్ణయం మాత్రం సౌరవ్ గంగూలీ, జే షా తీసుకోవాల్సి ఉంటుంది.