ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం అథ్లెట్లు, కోచ్‌లను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల సెలక్షన్ ప్యానెల్‌లో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లకు చోటు కల్పించారు. గతేడాది లాగే ఈ సారి కూడా అథ్లెట్లు, కోచ్‌ల ఎంపిక కోసం ఒకే సెలక్షన్ ప్యానెల్‌ను ప్రకటించారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలో ఈ ప్యానెల్ పనిచేయనుంది. పారాలింపిక్ రజత విజేత దీపా మలిక్ కూడా ఇందులో సభ్యురాలు. ‘‘ఈ ఏడాది కూడా అన్ని అవార్డులను ఎంపిక చేసేందుకు ఒకే ప్యానెల్‌ను ఏర్పాటు చేశాం. ఒకటి కంటే ఎక్కువ కమిటీలను నియమించడం వల్ల విభిన్న అభిప్రాయాలు వచ్చి వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. ద్రోణాచార్య అవార్డుల కోసం కోచ్‌ల పేర్లను పరిగణలోకి తీసుకునేటప్పుడు.. అవసరం అనుకుంటే ద్రోణాచార్య అవార్డు గెలిచిన ఇద్దరిని అదనపు సభ్యులుగా తీసుకునే వెసులుబాటు ప్యానెల్ అధ్యక్షుడికి ఉంటుంది’’ అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మాజీ టీటీ క్రీడాకారిణి మోనాలిసా, బాక్సర్ వెంకటేషన్ దేవరాజన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ తదితరులు ఆ ప్యానెల్‌లో ఉన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే క్రీడా పురస్కారాల కార్యక్రమం ఈ సారి కరోనా కారణంగా ఆలస్యంగా జరిగే అవకాశముంది.
సెహ్వాగ్‌కు సరికొత్త పదవి
Related tags :