చంద్రయాన్-2పై ఆసక్తికర వార్త తెలిసింది. మీకు గుర్తుందా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో చేరాక, ప్లాను ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుంచి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండరు చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కి.మీ. ఎత్తున ఉండగా, దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై కలియతిరుగుతూ పరిశోధన కోసం ఇందులో పంపిన ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నదని అంతరిక్ష ఔత్సాహికుడు, టెకీ షణ్ముగ సుబ్రహ్మణియన్ తాజా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్లో పెట్టాడు. గతంలో విక్రమ్ ల్యాండర్ జాడను కనిపెట్టిన ఈ టెకీ, ఇప్పుడు ఇస్రోకు మరో శుభవార్త అందించాడు. మే నెలలో నాసా విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించి ఈయన ప్రజ్ఞాన్ రోవర్ చెక్కుచెదరలేదని గుర్తించాడు. రఫ్ ల్యాండిగ్ వల్ల విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కొన్ని మీటర్ల దూరంలో పడిపోయిందని కనుగొన్నాడు. విక్రమ్‌తో సంకేతాలు నిలిచిపోయిన తర్వాత నవంబరు 2019లో నాసా లూనార్ రికాన్‌సెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) తొలిసారి శిథిలాలను గుర్తించింది. కానీ, చంద్రుడి ధ్రువ ప్రాంతం వద్ద ఆ సమయంలో చీకటిగా ఉండడంతో ఉపరితలం నుంచి 2 మీటర్ల లోతులో ల్యాండర్ ఉన్నట్టు గుర్తించారు. రోవర్ ఆచూకీ మాత్రం లభ్యంకాలేదు. ఆ సమయంలో నీడ ఉండడంతో రోవర్ కనిపించలేదని షణ్ముగ తెలిపారు. కానీ జనవరిలో తీసిన చిత్రాల్లో రోవర్ జాడ కనిపించిందని పేర్కొన్నారు. ఇది కదిలిన గుర్తులు కనిపిస్తున్నాయని, అంటే ఇది పనిచేస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు. ఇది పనిచేస్తుంటే ల్యాండర్‌కు సంకేతాలు కూడా పంపి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, ల్యాండర్‌తో సంకేతాలు లేకపోవడంతో ఇస్రోకు ఇవి చేరి ఉండకపోవచ్చన్నారు. తన వివరాలను ఇస్రోకు పంపానని, వారు ధ్రువీకరించాల్సి ఉందన్నారు. టెకీ షణ్ముగ సుబ్రహ్మణియన్ పంపిన వివరాలు తమకు అందాయని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. అయితే, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించినట్లు చెప్పారు. కాగా, ఇప్పుడే ల్యాండర్, రోవర్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని శివన్ పేర్కొన్నారు.
చంద్రయాన్ నుండి శుభవార్త
Related tags :