ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో విమానయానం మూగబోయింది. చాలా దేశాల్లో విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లోనే విదేశీ విమానాలను అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు మూడు నెలల క్రితం చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. దీనిద్వారా ఇప్పటివరకు దాదాపు 9లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు భారత పౌరవిమానయానశాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. భారత్ నుంచి దాదాపు లక్షా 16వేల మంది విదేశీయులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. మే 6 నుంచి ప్రారంభమైన ఈ మిషన్ ద్వారా జులై 31నాటికి నాలుగు దశల్లో 9లక్షల మందిని భారత్‌కు తీసుకువచ్చారు. వివిధ రవాణా మార్గాల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తీసుకొచ్చే ఈ మిషన్ కొనసాగుతూనే ఉంటుందని కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. దీనిలోభాగంగా ఐదో ఫేజ్(ఆగస్టు 1-31వరకు) నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ దశలో దాదాపు 53దేశాల నుంచి 700 విమానాల ద్వారా మరో లక్షా 20వేల మందిని భారత్‌కు తీసుకురానున్నారు. విదేశాలనుంచి సమూహాలుగా వచ్చే వారికోసం ఎయిర్ ఇండియా సంస్థ ప్రత్యేక చార్టర్డ్ విమానాలను కూడా నడుపుతోంది.
స్వదేశానికి 9లక్షల మంది
Related tags :