‘మీకు నచ్చినంత తినండి.. బిల్లు మాత్రం సగమే కట్టండి.’ కొత్తగా ఓపెన్ చేసిన ఏ రెస్టారెంటో.. ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన ఏ ఫుడ్ డెలివరీ యాపో అందిస్తున్న ఆఫరో అనుకుంటే మీరు పొరపడినట్లే! అంతేకాదు కేవలం ఏ ఒక్క రెస్టారెంట్‌కో.. లేదంటే ఒక నగరానికి మాత్రమే పరిమితమైనది కాదు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఆఫర్ వర్తిస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్ అందిస్తోంది ఇంకెవరో కాదు.. అక్కడి ప్రభుత్వమే!! కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన వేళ ఈ ఆఫర్‌ను బ్రిటన్‌లోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆగస్టు నెల మొత్తం ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు ఇది వర్తిస్తుంది. ఈ సమయంలో ఎంపిక చేసిన 72వేల రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్బులు ఇలా ఎక్కడికెళ్లినా ఈ ఆఫర్ పనిచేస్తుంది. దీనికి ‘‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’’ అని పేరు పెట్టారు. అయితే, ఆల్కహాల్‌కు మాత్రం వర్తించదు. ఈ ఆఫర్ కింద ఒక వ్యక్తికి గరిష్ఠంగా 10 పౌండ్లు వరకు డిస్కౌంట్ పొందొచ్చు. తిన్న తర్వాత ఎలాంటి వోచర్ లేకుండా సగం బిల్లు కడితే సరిపోతుంది. కనీసం ఇంత బిల్లు అవ్వాలని కూడా ఏమీ లేదు. రోజులో ఎన్నిసార్లు వచ్చినా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల బ్రిటన్‌లో చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇటీవల ఆంక్షలు సడలించినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘‘18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలను కాపాడడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చాం. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్లు సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ వాటికి పునరుజ్జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్థిక మంత్రి రిషి సునక్ పేర్కొన్నారు. అటు ఉద్యోగాలు, ఇటు వ్యాపారాలను కాపాడడం వీలవుతుందని చెప్పుకొచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన ఆయనే ఈ స్కీమ్‌కు రూపకల్పన చేయడం విశేషం. ఆఫర్ నేటి (ఆగస్టులో వచ్చిన మొదటి సోమవారం) నుంచి ప్రారంభం కావడంతో యూకేలోని అధిక శాతం రెస్టారెంట్ల వద్ద సందడి నెలకొంది. ఎక్కడికక్కడ ‘ఈట్‌అవుట్ హెల్ప్ అవుట్’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్లు రెస్టారెంట్ గోడలపై పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి.
సగం బిల్లుకే ఫుల్లు ఫుడ్డు
Related tags :