ఇటీవల ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) అధ్యక్ష పదవి నుండి విరమణ చేసి మరొకరికి బాధ్యతలు అప్పగించిన సెయింట్ లూయిస్‌కు చెందిన మంచికలపూడి శ్రీనివాస్ తన రెండేళ్ల పదవికాలంలో ఆ సంస్థ అభివృద్ధికి విశేషమైన కృషి జరిపారు. గుంటూరు జిల్ల కోతివానిపాలెంకు చెందిన అయన పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించి నాట్స్‌కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో గత రెండేళ్లల్లో రికార్డు సంఖ్యలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన హయాంలో నిర్వహించిన కార్యక్రమాలపై TNILIVE ప్రత్యేక కథనం….
2012లో సెయింట్ లూయిస్ నాట్స్ విభాగం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన శ్రీనివాస్ మంచికలపూడి… మాదాల రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ వంటి వారి స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగి నాట్స్ అధ్యక్ష పదవిని చేపట్టారు. సెయింట్ లూయిస్‌లో అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టారు. నాట్స్ జాయింట్ ట్రెజరర్‌గా కార్యనిర్వాహక బృందంలోకి ప్రవేశించిన ఆయన 2018 ఆగష్టులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి “భాషే రమ్యం-సేవే గమ్యం” అనే నాట్స్ నినాదానికి సార్ధకత తెచ్చిపెట్టారు.
రెండేళ్ల కాలంలో శ్రీనివాస్ నాయకత్వంలో నాట్స్ ఆధ్వర్యంలో రికార్డు సంఖ్యలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
* నాట్స్ ఫుడ్ డ్రైవ్‌ను భారీ ఎత్తున చేపట్టి అమెరికావ్యాప్తంగా నాట్స్ విభాగాలని ఏకతాటిపైకి తీసుకువచ్చి వేలాది మంది పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు.
* అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా శరవేగంగా హెల్ప్‌లైన్ ద్వారా సకాలంలో స్పందించి వారికి సహకారం అందజేశారు.
* గుంటూరు స్వచ్ఛ ఆరోగ్య ర్యాలీలతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహాన కల్పించారు.
* తీత్లీ తుఫాన్ బాధితులకు అండగా నిత్యావసరాలు అందించారు.
* తెలుగు విద్యార్ధుల విద్యా పునాదులు బలంగా ఉండాలని నమ్మే శ్రీనివాస్ మంచికలపూడి తెలుగునాట ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నాట్స్ ద్వారా కృషి చేశారు. ప్రభుత్వ బడుల దత్తతతో పాటు…విద్యార్ధుల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచేందుకు రోబోజ్ఞాన్ పేరుతో రోబోటిక్స్‌పై అవగాహాన కల్పించారు. విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సాహించేందుకు ప్రభుత్వ బడుల్లో క్రీడా సామాగ్రిని అందించారు.
* తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్లెల్లో వారి దాహార్తిని తీర్చేందుకు నాట్స్ ద్వారా తాగునీటి పథకాలకు సాయం చేశారు. ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత నీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేశారు.
* మహిళలు స్వశక్తితో ఎదగాలి..అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని నమ్మే శ్రీనివాస్ మంచికలపూడి పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించారు.
* కరోనా వంటి క్లిష్ట సమయంలో నాట్స్ ఛాప్టర్స్‌ను కరోనా పట్ల అప్రమత్తం చేసి…వెబినార్స్ ద్వారా కరోనాపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. యోగా, ప్రాణాయమంపై అవగాహాన, ప్రముఖ వైద్యులచే కరోనా పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై దిశా నిర్థేశం చేయించడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగునాట కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పక్కా ప్రణాళికతో నిత్యావసరాలు, భోజనాలను అందించారు. అర్చకుల నుంచి వలస కూలీల వరకు అందరి ఆకలి తీర్చేందుకు ఆయన మానవీయ కోణంలో సమున్నతంగా స్పందించారు.
* అమెరికాలో కూడా కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు నాట్స్ సభ్యులను సమన్వయపరుస్తూ ఆహార సేకరణ కార్యక్రమాల ద్వారా తన వంతు కృషి చేశారు.
* సెయింట్ లూయిస్‌కు చెందిన డా.అట్లూరి సుధీర్ తదితరుల సహకారంతో ఎన్నో వైద్య శిబిరాలను ఉచితంగా ఏర్పాటు చేశారు.
“వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్” అన్న గురజాడ స్ఫూర్తితో నాట్స్ అధ్యక్షుడిగా మంచికలపూడి శ్రీనివాస్ తనలోని సేవాభావాన్ని, నాయకత్వ పటిమను సమాజ శ్రేయస్సుకు వినియోగించారు. తన పదవి కాలం చివరి రోజున సైతం సేవా కార్యక్రమంతో విరమణ చేయడం ఆయనలోని నిబద్ధతకు నిదర్శనం. తన తదుపరి నాయకత్వానికి శ్రీనివాస్ వంటి వారి సేవాతత్పరత స్ఫూర్తిదాయకం. తనను వెన్నంటి ప్రోత్సహించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ అప్పసారి శ్రీధర్, మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ కార్యవర్గానికి, సభ్యులకు, సెయింట్ లూయిస్ స్థానిక ప్రవాసులకు మంచికలపూడి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సమాజ సేవ చేసే అవకాశం కల్పించిన నాట్స్ సంస్థ అభ్యున్నతికి భవిష్యత్తులో మరింత తోడ్పాటును అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
నాట్స్‌కు మంచి సేవలందించిన మంచికలపూడి-TNI ప్రత్యేకం
Related tags :