* మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
* గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.గంటా తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసీపీ వైపు మెగ్గు చూపుతున్నారని అన్నారు.అధికారం ఎక్కడ ఉంటే, గంటా అక్కడ ఉంటారన్నారు.అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని విమర్శించారు.తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డుదారిన వైసీపీలో చేరిందేకు ప్రయత్నాలు చేస్తున్నారని, సైకిళ్ళు కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటా, ఆయన అనుచరులు ఉన్నారని మంత్రి ఆరోపించారు.ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానన్నారు.గంటాపై ఆయన ప్రభుత్వంలో ఉన్నఓ మంత్రే ఫిర్యాదు చేశారని, ఇవన్ని లిక్స్ అని తాను అనుకుంటున్నానని మంత్రి అవంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
* తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ ప్రారంభించే పరిస్థితి ఇప్పట్లో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.కరోనా వ్యాప్తి కారణంగా మే నెలలో ఈ మార్కెట్‌ను మూసివేసి, తిరుమిళిసైలో తాత్కాలిక మార్కెట్‌ను అధికారులు ప్రారంభించిన విషయం విదితమే.
* అయోధ్యలో ఆగస్ట్ 5న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. అయోధ్య అంశంపై పార్టీ వైఖరికి సంకేతంగా రాముడు అందరివాడని, అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడంటూ మంగళవారం ప్రియాంక ట్వీట్ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బుధవారం జరిగే భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యతను చాటే సాంస్కృతిక సమ్మేళనంగా నిలిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు ప్రతీక అయిన రాముడు అందరితో ఉంటాడని ప్రియాంక హిందీలో ట్వీట్ చేశారు.
* టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. మీ ఆశీస్సులు కావాలంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. గత కొన్నిరోజులుగా తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, పలుచోట్ల వైద్య పరీక్షలు చేయిచేస్తే కరోనా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. సీటీ స్కానింగ్ కూడా తీయించానని, అయితే డాక్టర్ల సూచన మేరకు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకుని, నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలతో పాటు వెంకటేశ్వరస్వామి దీవెనలు తనకుండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతుడ్ని కావాలని కోరుకుంటున్నానని పృథ్వీ తన వీడియోలో తెలిపారు.
* ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో కరణం బలరాం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతను కూడా హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారు.
* సచివాలయం ఆకృతిపై నేడు కేసీఆర్ సమీక్ష.తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు.నేటి నుంచి తెలంగాణలో కొత్త మద్యం వేళలు అమలు.అయోధ్యలో భూమిపూజకు భారీగా ఏర్పాట్లు.మహానంది ఆలయంలో కరోనా దృష్ట్యా నేటి నుంచి వారం రోజులపాటు ఆలయం మూసివేత.ఏపీలో 231వ రోజుకు చేరుకున్న రాజధాని రైతులు, మహిళల నిరసన.శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు.గుంటూరు జిల్లాలో నేటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు 9వ విడత రేషన్ పంపిణీ.కరోనా కేసుల నేపథ్యంలో ఆదోనిలో కొనసాగుతున్న లాక్ డౌన్.
* శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలంగాణకు సూచించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డుఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం ద్వారా టీఎస్జెన్కో ఇప్పటికే 32.27 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు బోర్డ్ కు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.ఇంకా నీరు దిగువకు వదిలితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్న ఏపీ ప్రభుత్వంఏపీ ఫిర్యాదు మేరకు స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డుశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన బోర్డ్.
* ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే వీలుంది.దీంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతివాతావరణ కేంద్రం తెలిపింది.బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.
* కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మంగళవారం ఉదయం భారత్ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌పై జినోమ్ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరం – సమతుల్యత’ అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు.
* కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో జులై నాటికి దాదాపు 160దేశాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే 100కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఈ మహమ్మారి కారణంగా మరో 4కోట్ల మంది తొలిసారి పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వీటికి దూరమౌతున్నారని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు విద్యావ్యవస్థపై ‘తరాల విపత్తు’గా పరిణమించాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచదేశాలను హెచ్చరించింది.
* బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసును ఎందుకు ఆర్థిక కోణంలో విచారణ చేయటం లేదని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ముంబయి పోలీసులను ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.50కోట్లు విత్ డ్రా అయ్యాయని, కేవలం ఏడాది కాలంలో రూ.15కోట్ల నగదును డ్రా చేశారని తెలిపారు.
* సివిల్ సర్వీస్ పరీక్ష-2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 829 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో ప్రదీప్ సింగ్ మొదటి స్థానం సాధించాడు. జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఎంపికైన వారిలో 304మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని యూపీఎస్సీ వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఎస్సీ మహిళను ట్రాక్టర్‌తో హత్య చేయడం దారుణమన్నారు. కర్నూలు జిల్లా వెలుగోడు అత్యాచారం కేసు నమోదులో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఏపీలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
* కరోనా వైరస్ విజృంభణతో సినీ రంగం వణుకుతోంది. దేశంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కొవిడ్ బారినపడ్డారు. కొందరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరికొందరు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. తాజాగా ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్ కరోనా బారినపడ్డారు. 10 రోజుల నుంచి తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొంటూ ఆయన ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
* తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. 20వ తేదీ లోపు పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టే కేసీఆర్ అపెక్స్ భేటీని వాయిదా వేయిమని చెప్పినట్లు ఉందని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే సీఎంను ఇప్పటిదాకా చూడలేదని చెప్పారు. ఏపీకి న్యాయం చేస్తూ- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
* దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీవర్షాల ధాటికి మహా నగరంలోని లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురిసింది. కేవలం పదిగంటల నిడివిలోనే దాదాపు 230మి.మీ వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబయి నగరపాలక సంస్థ వెల్లడించింది. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నగరంలోని పలుప్రాంతాల్లో వరదలను తలపిస్తున్నాయి.
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనాతో ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ..రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి మాత్రం ముప్పు అలాగే ఉందని మంగళవారం శివసేన పార్టీ పత్రిక సామ్నా వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అలాగే రాజస్థాన్ రాజకీయాలతో పాటు అయోధ్యలో రామ మందిర నిర్మాణం నిమిత్తం భూమి పూజ, కరోనా వైరస్ తీవ్రత వంటి పలు విషయాలను ప్రస్తావించింది. దేశంలో కరోనా వైరస్ విపత్తు సృష్టిస్తోందని, రాముడి అనుగ్రహంతో అది అంతమవుతుందని పేర్కొంది.
* ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ బడ్జెట్ ధరలో మరో ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 9ప్రైమ్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ రియల్ మీ నర్‌జో 10, శాంసంగ్ గెలాక్సీ ఎమ్11 ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ ఐపీఎస్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లేని ఇస్తున్నారు.