DailyDose

₹35/- సన్‌ఫార్మా కోవిద్ మాత్రలు-వాణిజ్యం

₹35/- సన్‌ఫార్మా కోవిద్ మాత్రలు-వాణిజ్యం

* కొవిడ్‌-19 నుంచి ఉపశమనం కలిగించే యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ను ముంబయి కేంద్రంగా పనిచేసే సన్‌ఫార్మా సంస్థ దేశీయంగా ఫ్లూగార్డ్‌ పేరిట మంగళవారం విడుదల చేసింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను రూ.35గా నిర్ణయించింది. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి కొవిడ్‌-19 చికిత్సలో ఈ మాత్రలను వాడుతున్నారు. ఈ వారం నుంచే ఈ మాత్రలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సన్‌ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వంటి ప్రధాన షేర్లతో పాటు బ్యాంకింగ్‌, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఫార్మా రంగ షేర్ల అండతో సూచీలు పైకి ఎగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఏ దశలోనూ తిరిగి చూసే పరిస్థితి లేకుండా లాభాల్లో కొనసాగింది. మొత్తం 748.31 పాయింట్లు లాభపడి 37,687.91 వద్ద ముగిసింది. నిఫ్టీ మళ్లీ 11వేల మార్కును చేరుకుంది. 203.70 పాయింట్లు లాభపడి 11,095 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.05గా ఉంది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించారు. తమ దేశంలో టిక్‌టాక్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించాలని.. అలా జరగకపోతే మూసివేయాలని హెచ్చరించారు. అమెరికాలో టిక్‌టాక్‌ యాప్‌ కార్యకలాపాలను, సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. మైక్రోసాఫ్ట్‌ లేదా ఏ ఇతర అమెరికన్‌ కంపెనీ కొనుగోలు జరిపినా.. చేతులు మారిన మొత్తంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని ఆయన నిబంధన విధించారు.

* రంగంలో రాబోయే రెండేళ్లలో గణనీయ మార్పులొస్తున్నాయని అంచనా వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వివరించారు. ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణానికి ఇష్టపడతారా లేక ప్రజా రవాణాలో కొనసాగుతారా అనేది గమనించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రయాణికుల వాహనాలకు లభించే గిరాకీ ఈ పరిణామంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. టాటా మోటార్స్‌ దేశీయ వ్యాపారం కూడా పునరుత్తేజం అవుతున్న క్రమంలో, 2019-20లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, కొవిడ్‌ మళ్లీ ప్రతికూల ప్రభావం చూపాయని వాటాదార్ల సమావేశంలో చంద్రశేఖరన్‌ తెలిపారు. బ్రెగ్టిట్‌పై స్పష్టత వచ్చిందని అయితే వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వృద్ధి నెమ్మదించడం, కఠిన నియంత్రణావళి వంటివి వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేశాయని వివరించారు. డిజిటల్‌ అనుభవాలపై ఆసక్తి పెరుగుతోందని, ఆరోగ్య సంరక్షణ, భద్రతా అంశాలకు ప్రాధాన్యం ఇనుమడిస్తోందన్నారు. ప్రయాణాలు తగ్గించుకోవడం రవాణా రంగంపై అమిత ప్రభావం చూపుతోందని వెల్లడించారు.

* అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ.393.68 కోట్ల విలువైన షేర్లను ఒక విదేశీ సంస్థ సోమవారం విక్రయించింది. ఒక్కో షేరును రూ.1600.43 చొప్పున, ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాల ద్వారా 23,97,380 షేర్లను మంచెనర్‌ సంస్థ విక్రయించింది. జూన్‌ త్రైమాసికం చివరకు ఈ సంస్థకు అపోలో హాస్పిటల్స్‌లో 1.72 శాతం వాటా ఉంది. సోమవారం బీఎస్‌లో అపోలో షేరు 6 శాతం నష్టపోయి రూ.1574 వద్ద స్థిరపడింది.