సినీ వర్గాలతో పాటు, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి సహా ఆమె తల్లిదండ్రులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, సోదరుడు షోయిక్ చక్రవర్తితో పాటు శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ అనే మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు బిహార్ పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తన కొడుకు మృతికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి గత నెలలో పట్నా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. బిహార్ ప్రభుత్వ అభ్యర్థనను అంగీరిస్తూ కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ముందునుంచి మహారాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సుశాంత్ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ ఖాతాల నుంచి రియా చక్రవర్తికి రూ. 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆ దిశగా ఆరా తీస్తోంది. ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.
Big Breaking:రియా చక్రవర్తిపై CBI FIR
Related tags :