Fashion

గొల్లభామ చీర ప్రత్యేకత అది

గొల్లభామ చీర ప్రత్యేకత అది

తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్‌ ఘల్‌ లాడిస్తూ, మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామల గురించి మనందరికీ తెలుసు. ఆ వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే… ఆ మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే… అదే గొల్లభామ చీర. తెలుగు నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ చీరల తయారీలో సిద్దిపేటకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది.
*ఒక్కో పోగు జత చేసి, కళాత్మకతను రంగరించి రూపొందించే గొల్లభామ చీరలంటే మక్కువ చూపని మగువలు ఉండరు. సిద్దిపేట, దుబ్బాకల్లో 1960వ దశకంలో చేనేత కార్మికులు గొల్లభామ చీరను ఆవిష్కరించారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో గొల్ల వనితలు ఇల్లిల్లూ తిరుగుతూ పాలు, పెరుగు విక్రయించేవారు. వారిని గమనించిన నేతన్నలు చీరల మీద ఆ తరహా చిత్రాన్ని ఆవిష్కరించారు. అదే గొల్లభామ చీరగా ప్రాశస్త్యం పొందింది.
*గొల్లభామ చీరల పేరు చెబితే సిద్దిపేట చేనేతన్నలే ముందుగా గుర్తొస్తారు. గతంలో సిద్దిపేట జిల్లాలో వేలాది మంది చేనేత కార్మికులుండేవారు. మారుతున్న పరిస్థితులు, యాంత్రీకరణ వల్ల వీరి సంఖ్య చాలా వరకు తగ్గింది. చేనేత పరిశ్రమ కూడా పాలకుల నిరాదరణకు గురయ్యింది. దాంతో గొల్లభామ చీరల తయారీ ఒడుదొడుకులు ఎదుర్కొంది. వీటి నేతకు ఎక్కువ సమయం అవసరమవడం, తక్కువ ఆదాయం వస్తుండటంతో చేనేత కార్మికులు వీటి నేతను వదిలిపెట్టి మామూలు వస్త్రాల్లోకి వచ్చారు. నాలుగేళ్ల కిందట నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జాకార్డ్‌ మగ్గాలు అందుబాటులోకి రావడంతో ఈ చీరలకు మళ్లీ గత వైభవం వచ్చింది. అంతకుముందు వీటి నేతకు ఫ్రేమ్‌ (గుంత) మగ్గాలను వినియోగించేవారు. దీని మీద అయిదున్నర మీటర్ల చీర తయారీకి వారం రోజుల సమయం పట్టేది. ఇప్పుడు జాకార్డ్‌ మగ్గం మీద రెండు మూడు రోజుల్లోనే చీర నేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 14 చేనేత సహకార సంఘాల్లో 545 మంది చేనేతకారులు పనిచేస్తుండగా, సిద్దిపేటలో 50 మంది కార్మికులు మాత్రమే గొల్లభామ చీరలు, దుప్పట్టాలు నేస్తున్నారు.
**సిద్దిపేటకు పేటెంటు
గొల్లభామ చీరకు 2012లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత మెల్లగా చేనేతన్నలు మళ్లీ వీటి నేత వైపు మళ్లారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఆసక్తి, అనుభవం కలిగిన కార్మికులకు ప్రభుత్వం జాకార్డ్‌ మగ్గంపై గొల్లభామ చీరల తయారీ శిక్షణ ఇచ్చింది. ఈ చీర నేత మీద సిద్దిపేట పేటెంటు హక్కులూ పొందింది. 2019 ఫిబ్రవరిలో సిద్దిపేట జిల్లాలోని ఆరు చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 22 జాకార్డ్‌ మగ్గాలను అందజేసింది. కార్మికులకు మరోసారి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. గతంలో గుంత మగ్గాల మీద చేత్తో డిజైన్‌ రూపొందించి దారంతో శాంచ తయారు చేసేవారు. ఈ విధానంలో వివిధ రంగుల దారాలు వాడటం, గొల్లభామ డిజైన్లలో మార్పులు తేవడం కష్టంగా ఉండేది. జాకార్డ్‌ మగ్గాలు రావడంతో పరిస్థితిలో మార్పొచ్చింది. ప్రస్తుతం కంప్యూటర్‌లో రూపొందించిన డిజైన్లను పంచ్‌కార్డుల రూపంలో జాకార్డ్‌లో ఉంచుతున్నారు. కార్మికుడు లిఫ్ట్‌ మిషన్‌ను కాలితో తొక్కినప్పుడు దారాలను జాకార్డ్‌ పైకి కిందకు కదుపుతుంది. తర్వాత కార్మికులు చేత్తోనే వత్తులు తీస్తారు. తద్వారా గతంతో పోల్చితే ప్రస్తుతం విభిన్న రంగులు, డిజైన్లలో చీరలు రూపుదిద్దుకుంటున్నాయి. సిద్దిపేటలోని ఆదర్శ చేనేత సహకార సంఘం.. చీరలతో పాటు చున్నీల మీదా గొల్లభామ చిత్రాలను తీర్చిదిద్దుతోంది. ఇక్కడ ఒక మగ్గం మీద దుప్పట్టాలు, మూడు మగ్గాల మీద గొల్లభామ చీరలు రూపొందిస్తున్నారు. నెలకు సగటున సుమారు 400 చీరలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు సిద్దిపేట ప్రాంతంలో 20 జాకార్డ్‌ మగ్గాలు, 30 గుంత మగ్గాలను వీటి తయారీకి వినియోగిస్తున్నారు. గొల్లభామ చీర ధర రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఉంటుంది. ఈ చీరలు, దుప్పట్టాలను తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టిస్కో) కొనుగోలు చేసి విక్రయాలు సాగిస్తోంది. గతంలో ఇక్కడి కార్మికులకు నెలకు రూ.5 నుంచి 6 వేలు ఆదాయం దక్కితే ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఈ చీరల విక్రయాలు సాగుతున్నాయి.
**ఇరవై రంగుల్లో
గొల్లభామ చీరల తయారీలో మొదట నూలును కొనుగోలు చేసి దానికి అవసరమైన రంగులు అద్దుతారు. తర్వాత ఆ నూలుని ఉండలు చుడతారు. అనంతరం పడుగు, పేకలుగా జాకార్డ్‌ మగ్గం మీదకి ఎక్కిస్తారు. గొల్లభామ డిజైన్‌ కోసం ప్రత్యేక గ్రాఫ్‌లు వాడతారు. వీటిని ప్రకాశం జిల్లా చీరాల నుంచి తెచ్చుకుంటారు. కాలితో యంత్రాన్ని తొక్కుతూ చీరలు, దుప్పట్టాలు నేస్తారు. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం పడతాయి. ప్రస్తుతం నీలం, గోధుమ, పసుపు తదితర ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. గొల్లభామ చీరలు నేయడంలో తమ కళాత్మకతను ప్రదర్శించిన చాలా మంది నేతన్నలు రాష్ట్ర చేనేత జౌళి శాఖ అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వీరబత్తిని సోమయ్య (70) తొలిసారిగా గొల్లభామ పట్టుచీరను నేసి ఈ పురస్కారం దక్కించుకున్నారు. 16 ఏళ్ల నుంచి ఈయన చేనేత వృత్తిలో ఉన్నారు.
* కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరలు ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకున్నాయి. దివంగత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు ఈ చీరల గురించి తెలిసి తమ కుటుంబంలోని మహిళల కోసం సిద్దిపేట నుంచి తెప్పించుకున్నారు. శంకర్‌ దయాళ్‌ శర్మ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు కుటుంబం కోసం వీటిని కొనుగోలు చేశారని ఇక్కడి చేనేత కార్మికులు గొప్పగా చెప్పుకుంటుంటారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా పాలనాధికారిగా ఉన్నప్పుడు గొల్లభామ చీరలనే ధరించేవారు. తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళలూ ఇష్టంగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. సినీ కథానాయిక సమంత ఈ చీరల మీద మక్కువపడి పలుసార్లు సిద్దిపేటకు వచ్చారు.
*కళా నైపుణ్యంలో మేటిగా నిలిచే ఈ చీరల తయారీని నేర్చుకోవడానికి ఆధునిక తరం ముందుకు రాకపోవడం బాధాకరం. ఇక్కడి ఆదర్శ చేనేత సహకార సంఘంలో అందరూ యాభై ఏళ్లు పైబడిన వారేనని, యువతరం ఈ కళను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా లేదని సంఘం మేనేజరు హన్మంతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చీరలకు ఆదరణ బాగా ఉన్నా నేతగాళ్ల కొరత ఎక్కువగా ఉంది. ఈ సమస్య పరిష్కారమైతే.. మన నేతన్న కళాతృష్ణకు అద్దంపట్టే గొల్లభామ చీరలు మరింతగా వన్నెచిన్నెలద్దుకుంటాయి.