Politics

ఏపీ ఆదాయంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ఏపీ ఆదాయంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, దాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజల కర్తవ్యమని తెలిపారు. ఏపీ రాజధాని విషయంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను అమరావతికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో జిల్లాలకు 160 ప్రాజెక్టులు ప్రకటించామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలనే హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించాం. హైటెక్‌ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అవన్నీ రావడం వల్లే హైదరాబాద్‌కు అధిక ఆదాయం వస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం మన ఏపీనే. రాష్ట్రంలో పెద్ద నగరం ఏది లేదు. అందుకే అమరావతి నిర్మాణం చేపట్టి.. అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కానీ ఇవన్ని ధ్వంసం చేసి మూడుముక్కలాట ఆడుతానంటే.. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధిలో భాగంగా నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం. 63 ప్రాజెక్టులు చేపట్టి.. అనేకం పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి రూ. 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. తిరుపతిలోనే రూ. 90వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతిని హరిత రాజధానిగా నిర్మించేందుకు కృషి చేశాం. విశాఖలో గంగవరం పోర్టును నేనే తీసుకొచ్చా. విశాఖ ప్రజలు నీతి, నిజాయితీ కలవారు. వేల మంది అమరావతి రైతుల పొట్ట కొట్టి రాజధానిని విశాఖ ప్రజలు కోరుకోరు’’అని చంద్రబాబు చెప్పారు.