* టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. కాసేపట్లో గుత్తి కోర్టులో ఆయనను హాజరుపర్చనున్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్‌పై గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు కాలరాశారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* కేరళలో విరిగిన కొండచరియలు- 9మంది మృతి★ కేరళలోని పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.★ ఇడుక్కి జిల్లా రాజమలలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి.★ ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
* జేసీ కుటుంబానికి మరో షాక్ తగిలింది. కడప సెంట్రల్ జైలు వద్ద గురువారం కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే జైలు నుంచి విడుదల సందర్భంగా భారీ వాహనాల నడుమ తాడిపత్రికి బయల్దేరారు. కోవిడ్ కారణంగా వాహన శ్రేణికి పోలీసులు అనుమతించలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జేసీ ఫ్యామిలీతో పాటు మరో 31 మంది తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జేసీ ప్రభాకర్‌రెడ్డిని మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కండీషన్ బెయిల్‌లో భాగంగా ఈ ఉదయం జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సంతకాలు పూర్తయినా ఇంకా స్టేషన్‌లోనే కూర్చుండబెట్టారు. అనారోగ్యంగా కారణాన తనను ఇంటికి పంపించాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. అయినా విచారణ పేరుతో ఇద్దరిని స్టేషన్‌లోనే ఉంచారు.మరోవైపు తాడిపత్రి పట్టణానికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. అనంతపురం నుంచి స్పెషల్ పార్టీ పోలీసులు, వజ్ర వాహనం, ఆదనపు బలగాలను తాడిపత్రి పట్టణానికి అధికారులు తరలిస్తున్నారు. ఇతర కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అశ్విత్‌రెడ్డిలను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది
* కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి పరిశ్రమలోని పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ పైపు పేలి వేడినీళ్లు ఎగిసిపడ్డాయి. అక్కడ విధుల్లో ఉన్న సీనియర్ బాయిలర్ ఆపరేటర్ లక్ష్మణమూర్తి (62)పై ఆ నీళ్లు పడి 90 శాతం మేర శరీరం కాలి గాయపడగా, చిన్న మౌలాలి, ఓబులేసు అనే కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. లక్ష్మణమూర్తిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో నెల రోజుల క్రితమే సీవో2 ప్లాంట్‌లో అమోనియం లీకేజీతో కంపెనీ జీఎం మృతి చెందిన విషయం విదితమే. నెల రోజులుగా మూతపడ్డ పరిశ్రమ ఇటీవలే పని చేయడం ప్రారంభించింది. అంతలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలాన్ని నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి సందర్శించి విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ బాయిలర్ పైపు పగిలి నీళ్లు పడటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.
* పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న మేఘాపవర్ కంపెనీలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. కూలీలకు చెల్లించేందుకు రూ.52 లక్షలను సంస్థ కార్యాలయంలో ఉంచగా.. ఆ నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయన్ని కంపెనీ యాజమాన్యం గురువారం గుర్తించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు ఈ చోరీపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి ప్రమేయం ఉందని అనుమానించారు. ఆ వెంటనే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌కౌశల్‌కు పలు వివరాలు తెలపారు. ఆయన ఆదేశాలతో సదరు యువకుడు అద్దంకి పరిసర ప్రాంతాలకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్సై వెలగా మహేష్ రంగంలోకి దిగి స్థానికంగా ఉన్న ఓ లాడ్జీలో నిందితుడు ఉన్నట్లు సాంకేతికత ఆధారంగా తెలుసుకొని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి అప్పటికే కొంత మొత్తంతో ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలింది. నిందితుడు అద్దంకి మండలం శంఖవరప్పాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఇక్కడి అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు.