పంటల సీజన్ వేళ దేశంలోని పేద రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలిచారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో నగదు బదిలీ చేశారాయన.
పీఎం కిసాన్ పథకం కింద పేద రైదులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందజేస్తున్నది. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుండా, ఆదివారం నాడు ఆరో విడత నగదు బదిలీని ప్రధాని చేపట్టారు. ఈ పథకం కోసం కేంద్రం రూ.75 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
”భూమిని దున్నే నాగలినే(హలాన్నే) ఆయుధంగా మలుచుకున్న భగవాన్ బలరాముడి జయంతి కూడా ఇవాళే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ అభినందనలు. హలధారి జయంతి నాడే రైతులకు ఎంతో మేలు చేసే పీఎం కిసాన్ నిధులను ఖాతాల్లో జమచేయడం ఆనందంగా ఉంది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదును చేర్చడం ద్వారా ఈ పథకం గొప్ప విజయాన్ని సాధించిందని భావిస్తున్నాను” అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీపై పీఎం కిసాన్ స్కీమ్ సీఈవో వివేక్ అగర్వాల్ శనివారం అర్థరాత్రి తర్వాత కూడా పని చేశారు. ఆదివారం ఉదయం అనుకున్న సమయానికే ప్రధాని మోదీ ఆన్ లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. పేద రైతులకు పంట సాయంగా మోదీ సర్కారు అందిస్తోన్న పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతల్లో నగదును జమ చేశారు. అయితే విడత విడతకూ లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతున్నట్లు రిపోర్టుల్లో వెల్లడైంది. 2029 వరకూ ఈ పథకం కొనసాగనున్న నేపథ్యంలో లబ్దిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం ఆందోళనకరంగా మారింది.