ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పారిశ్రామికాభివృద్ధి విధానం 2020-23” ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ శ్రీమతి రోజా లాంఛనంగా ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదిగేందుకు, అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధిని కాంక్షించేలా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ సరికొత్తగా రూపొందించబడింది. పారిశ్రామిక, విద్యా, ఆర్థిక, వాణిజ్య వేత్తల సమక్షంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా సోమవారం కొత్త పారిశ్రామిక విధానం విడుదలైంది.
అన్ని ప్రాంతాల, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం సమానవృద్ధికి దిక్సూచిగా మారనుంది. పారిశ్రామిక ప్రపంచంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వెన్నుదన్నుగా, వాణిజ్య ఖర్చును తగ్గించే వినూత్న పద్ధతులను అవలంబించనుందీ పాలసీ. 30 నైపుణ్య కళాశాలలను, 2 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యువతీ, యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పారిశ్రామికవేత్తలుగా మలచడం, ఉన్నతమైన జీవన ప్రమాణాలను సృష్టించడం వంటి కీలక విషయాలపై పారిశ్రామిక అభివృద్ధి విధానం దృష్టిసారించనుంది.
సహజ వనరులైన సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతర విద్యుత్ సరఫరా, నీరు, మౌలిక వసతులు, అన్ని ప్రాంతాలతో మన రాష్ట్రం అనుసంధానంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి ఓ వరం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలైన విమానాశ్రాయాలు, పోర్టులు సమృద్ధిగా ఉండడం, అపార నైపుణ్యం కలిగిన మానవవనరులు మరో బలం. అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ…వనరులను వినియోగించుకుంటూ పారిశ్రామికాభివృద్ధిలో తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అవసరమైన విధివిధానాలు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో సమ్మిళితమై ఉన్నాయడనంలో ఏ మాత్రం సందేహం లేదు.
పారిశ్రామికరంగంలో కీలకమైన ఔషధ,జౌళి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, పెట్రో కెమికల్ రంగాలతో పాటు కళాత్మక బొమ్మల తయారీ(టాయ్స్), గృహోపకరణాలు (ఫర్నిచర్), ఫుట్ వేర్,లెదర్, మెషినరీ, పనిముట్ల తయారీ,ఏరోస్పేస్, రక్షణ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 2020-23 భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలబెట్టడం ఖాయం.
సాహసోపేతమైన సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధించడానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఈ కొత్త పాలసీ అండగా నిలబడుతుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టడం, నిజమైన మహిళా సాధికారతను సాధించడమే సరికొత్త పారిశ్రామిక విధానం అంతిమలక్ష్యం. రాష్ట్రాభివృద్ధికి మూలాధారమైన ‘రెడీ-బిల్ట్ ప్రీ-క్లియర్డ్’ సదుపాయాలను సృష్టించడం, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను అందించడంపైనా దృష్టి పెట్టనుంది.
రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంపైనా పాలసీ ప్రత్యేకదృష్టి సారించింది. ప్రణాళికబద్ధమైన పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వనుంది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి ‘ప్రమాద రహిత(Investment-friendly) -స్నేహపూర్వక వాతావరణాన్ని(Friendly Environment) అందించడానికి పారిశ్రామిక జోనింగ్ ను అమలు చేయాలని పారిశ్రామిక విధానం 2020-23 సంకల్పించింది. ఒక ప్రత్యేక పద్ధతిలో ‘లీజు కమ్ బై ఔట్’ నమూనాలో భూ కేటాయింపు ఇవ్వనుంది.
పెట్టుబడిదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని “వైయస్ఆర్ ఏపీ వన్” పేరుతో బహుముఖ వ్యాపార కేంద్రానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పెట్టుబడిదారులకు పూర్తి కాలం తోడ్పాటు అందించడమే చెక్కు చెదరని ఉక్కుసంకల్పం. ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్ సపోర్ట్, ప్రోత్సాహక నిర్వహణ మరియు స్పెషల్ కేటగిరీ సేల్ వంటి సేవలను విరివిగా అందించడానికే ‘వైయస్ఆర్ ఏపి వన్’ సెల్ ఏర్పాటుకు మూలకారణం. పెట్టుబడిదారులకు ఆద్యంతం అవసరం మేరకు మద్దతు అందిస్తూ పెట్టుబడులకు అవాంతరాలు లేకుండా పాలసీకి మూలస్తంభమైన పరిశ్రమల స్థాపనకు కృషి.
ఈ కొత్త పారిశ్రామిక విధానంపై గౌరవ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ “పరిశ్రమలు, విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞులతో విస్తృతమైన సంప్రదింపులతో పాటు, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన అనంతరం అత్యుత్తమ విధివిధానాలు పాలసీలో పొందుపరచి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని సిద్ధం” చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ విధానం యువత, మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.